
ప్రొద్దుటూరు టౌన్: స్కాముల చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలిపిన రోజే రాష్ట్రం బాగుంటుందని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 36 గంటల నిరాహారదీక్ష కు రోజా మంగళవారం సాయంత్రం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్లు, మరుగుదొడ్లు, ఇసుక, మ ద్యం విషయంలో టీడీపీ నాయకులు సిగ్గులేకుండా దోచుకోవడానికి తెగబడ్డారని చెప్పడానికి నిజంగా బాధేస్తోందన్నారు. ఎందుకంటే వైఎస్సార్ ప్రభుత్వాన్ని, బాబు ప్రభుత్వాన్ని చూస్తే అక్కడ అన్నీ స్కీంలు, ఇక్కడ అన్నీ స్కాంలని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఇళ్లు, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇలా అన్ని కుటుంబాల్లో సంతోషం నింపడానికి ఎన్నో పథకాలను వైఎస్సార్ అమలు చేశారన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని భూముల్లో స్కాం, పోలవరం అంచనాలు పెంపులో స్కాం, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణంలో స్కాం, వైజాగ్ భూముల్లో స్కాములేనన్నారు. ఈ స్కాముల ప్రభుత్వాన్ని తరిమికొట్టాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం మన దురదృష్టం అయితే, రాచమల్లు మీ ఎమ్మెల్యే కావడం మీ ఆదృష్టమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే మనసున్న నాయకుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. అన్నా అంటూ ఓట్లు వేసిన మీ అందరికీ ఎంత విధేయతగా ఉంటారో, నమ్మి నాయకత్వం ఇచ్చిన జగనన్నకు విశ్వాసపాత్రుడుగా ఉన్నారని కొనియాడారు. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలంలో ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రాణత్యాగానికి సిద్ధమై దీక్ష చేస్తున్నారన్నారు. తన బాధ్యతను గుర్తు చేసుకుని ప్రతి సమస్యపై మీ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని చూసి సంతోషంగా ఉందన్నారు. 48 గంటలు భోజనం తినకుండా మీకోసం రాచమల్లు అన్న పోరాడుతున్నాడంటే, మనందరి కోసం జగనన్న ఎంత పోరాటం చేస్తున్నారో ఆలోచించాలన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు మాయలో పడకుండా జగనన్న నిజాయితీని గుర్తించి రాజన్నరాజ్యం కోసం అందరూ కలిసిరావాలని కోరారు. దీక్ష ఇంతటితో ఆగిపోదని భవిష్యత్తులో న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్‌సీపీ తరపున పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment