మంత్రి వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
అనంతపురం : అనంతపురం టీడీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ తలెత్తగా ధర్మవరంలో ఉద్రికత్త వాతావారణం నెలకొంది. ఈ విషయంపై ఎమ్మెల్యే సూరి తన వర్గీయులతో సహా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి మంత్రి పరిటాల వర్గీయులపై ఫిర్యాదుచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ... డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. టీడీపీలో చిన్న చిన్న గొడవలు సహజమేనని, అయితే ఆ గొడవలను ఒక కుటుంబంలా సర్దుబాటు చేసుకుంటామని ఎమ్మెల్యే వరదాపురం సూరి అన్నారు.
మంత్రి సునీత వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఆ పార్టీ ఎమ్మెల్యే సూరి వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గీయులు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు.