ప్రమాదంలో నుజ్జునుజ్జుయిన కారు(ఫైల్)
* కార్ల రేసింగ్ కేసును.. ప్రమాదం కేసుతో సరిపెట్టిన పోలీసులు
* రేసింగ్‌తో గుంటూరు జిల్లాలో విద్యార్థి మృతి!
* ఒక కారును నడుపుతున్నది ఎమ్మెల్యే బోండా పెద్ద కుమారుడు సిద్దార్థ
* బోండా కథనం ప్రకారమే కుక్క కథ!
సాక్షి, గుంటూరు/విజయవాడ: గుంటూరు జిల్లా లో ‘కార్ల రేసింగ్’ను వీడియో తీసేందుకు బడా బాబుల పిల్లలు తమ వెంటబెట్టుకెళ్లిన విద్యార్థి.. ఆ కార్ల రేసింగ్‌లో ప్రమాదంతో మృతి చెందిన ఘటనను ‘కుక్క కథ’తో ముగించనున్నారా? మూడు రోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఔననే సమాధానం చెప్తున్నాయి. ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా యడ్లపాడు మం డలం తిమ్మాపురం గ్రామం చెరువు సమీపంలో జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతున్న రెండు కార్లు ఢీకొని విజయవాడ కృష్ణలంకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రాగెళ్ల విజయనాగేంద్ర మృత్యువాతపడిన విషయం తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పెద్ద కుమారుడు సిద్ధార్థ పరోక్షంగా ఈ సంఘటనకు కారకుడని తెలుస్తోంది. కానీ పోలీసులు ఈ కార్ల రేసింగ్ విషయం కానీ, అందులో సిద్ధార్థ పాత్ర కానీ ఏమీ లేకుండానే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రేసులో కార్లు ఢీ కొట్టుకుందిలా...
ప్రమాదానికి గురైన రెండు కార్లలో ఫార్చునర్ కారును (ఎ.పి. 37బీఏ 4646) బొండా సిద్ధార్థ నడుపుతుండగా మరో స్కోడా కారును (ఎ.పి. 31సీపీ 0999) కుప్పల శివరాం డ్రైవ్ చేస్తున్నా డు. వీరిరువురు కారు రేసింగ్ ఆడుతూ ముందు ఎమ్మెల్యే తన యుడు సిద్ధార్థ నడుపుతున్న ఫార్చ్యూనర్ వెళుతుండగా ఉప్పువాగు వంతెన సమీపంలో కొప్పు ల శివరామ్ స్కోడా కారుతో ఓవర్‌టేక్ చేయ బోయే క్రమంలో కార్లు ఢీకొన్నాయి. ఈ సమయంలో సిద్ధార్థ కారు డోరు పక్కనే ఉండి వీడియో తీస్తున్న నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడని చెప్తున్నారు. జరిగిన ఘటనపై నోరు విప్పేందుకు నాగేంద్ర కుటుంబీకులు సాహసించడం లేదు.
తూతూ మంత్రంగా కేసు..
చట్ట విరుద్ధంగా కార్ల రేసింగ్ నిర్వహించడమే కాక ఓ విద్యార్థి మృతికి కారణమైన ఇలాంటి సందర్భాల్లో సెక్షన్ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) ఐపీసీ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే.. యడ్లపాడు పోలీసు స్టేషన్‌లో మాత్రం.. చిలకలూరిపేటలో స్నేహితుడి ఇంట్లో జరిగే వేడుకలకు వెళుతూ కుక్క అడ్డురావడంతో బ్రేకు వేయగా అదుపు తప్పి కార్లు ప్రమాదానికి గురైనట్టు ఎమ్మెల్యే బొండా పేర్కొన్నట్లుగానే.. శుభకార్యానికి వెళుతూ అతివేగంతో కారు నడిపినట్లుగా సిద్ధార్థ, శివరాంలపై తూతూమంత్రంగా కేసు నమోదు చేశారు. సిద్ధార్థ, శివరాంలను రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని యడ్లపాడు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు మంగళవారం చెప్పారు.