cars racing
-
చంద్రుడిపై వచ్చే ఏడాది కార్ల రేసు..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జాబిల్లిపై కార్ల రేస్ జరగబోతోంది! మన చందమామపై కార్లు రయ్ రయ్‌మని దూసుకెళ్లనున్నాయి. ఇందుకోసం అమెరికా హైస్కూల్ విద్యార్థులు రెండు కార్లను డిజైన్ చేయనున్నారు! మన జాబిల్లిపైకి మనుషులింకా అడుగుపెట్టలేదు కానీ అంతరిక్ష పరిశోధనల కారణంగా బోలెడన్ని వాహనాలైతే వెళ్లాయి. రిమోట్ కంట్రోలర్ల సాయంతో వాటిని భూమి మీద నుంచే నడిపించినట్లే.. 2021 అక్టోబర్‌లో నిర్వహించనున్న కార్ల రేసు కూడా అలాగే జరుగుతుందట. ఈ రేసులో పాల్గొనే కార్ల సైజు మాత్రం చాలా చిన్నది. భూమ్మీద ఒక్కో కారు బరువు 2.5 కిలోలు ఉంటే చంద్రుడి పై వాటిని దించేందుకు ఉపయోగించే వ్యవస్థ బరువు ఇంకో 3 కిలోలు ఉంటుంది. రేసులో పాల్గొనేది రెండు కార్లు కాబట్టి మొత్తం ఐదు కిలోలు, దించే వ్యవస్థ మూడు కిలోలు కలుపుకొంటే మొత్తం 8 కిలోల బరువును జాబిల్లికి చేర్చాలన్నమాట. ఈ చిన్న బరువును అక్కడికి తీసు కెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్–9 రాకెట్ ద్వారా ఇంట్యూటివ్ మెషీన్స్ అనే కంపెనీ తయారు చేసిన నోవా–సీ ల్యాండర్ ద్వారా జాబిల్లిపైకి చేరనుంది. జాబిల్లిపైకి ఓషియన్ ప్రోసె ల్లారమ్ ప్రాంతంలో దిగే నోవా–సీ ముందుగా ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా సర్వే చేసిన తర్వాతే వాటిని దించుతుంది. లైవ్‌లో కారు రేసు.. ఈ కార్ల రేసును లైవ్‌లో ప్రసారం చేయా లని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్ కంపెనీ భావిస్తోంది. మూన్ మార్క్ మిషన్–1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్ విద్యార్థుల బృందాలతో కార్ల డిజైన్ చేయిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్ మెషీన్స్ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్ చేయ డం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో టాడ్ వాలాచ్ ‘న్యూ అట్లాస్’తో చెప్పారు. భూమి నుంచి అక్కడకి సమాచారం కాంతి వేగంతో ప్రయాణించినా సంకేతం వెళ్లేందుకు 1.3 సెకన్ల సమయం పడుతుంది. ట్రాక్ మాటేమిటి? ఇక్కడైతే కార్ల రేసులన్నీ తారురోడ్లపై నడుస్తాయి. మరి జాబిల్లిపైని కారు రేసు? ఇందుకు ఫ్రాంక్ స్టీఫెన్సన్ అనే రేసు కారు డ్రైవర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, జాబిల్లిపై మట్టి ధర్మాలను పరిగణనలోకి తీసుకుని అక్కడే నిర్మిస్తారని కంపెనీ చెబుతున్నా.. వాస్తవానికి ఇది జాబిల్లి మట్టిపైనే జరుగుతుందని అంచనా. అయితే ఈ రేసు నిర్వహణకు కావాల్సిన భారీ మొత్తాన్ని రేసు వీడియోలను ప్రపంచమంతా పంపిణీ చేయడం ద్వారా ఆర్జిస్తామని మూన్‌మార్క్ చెబుతోంది. కానీ.. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే పలు సందేహాలూ కలుగుతున్నాయి. ఇది అసాధ్యమనే వారూ లేకపోలేదు. స్పేస్ ఎక్స్‌తో పాటు పలు ఇతర కంపెనీలు సహకరిస్తే గానీ ఇది సాధ్యం కాదని కొందరు నిపుణులు పెదవి విరుస్తున్నారు. మూన్‌మార్క్ మాత్రం అన్ని ప్రశ్నలకూ కాలమే సమాధానం చెబుతుందని.. 2021 అక్టోబర్ వరకు వేచి చూడాలని చెబుతోంది. -
ఎమ్మెల్యే తనయుడిని కాపాడ్డానికి కుక్క కథ!
* కార్ల రేసింగ్ కేసును.. ప్రమాదం కేసుతో సరిపెట్టిన పోలీసులు * రేసింగ్‌తో గుంటూరు జిల్లాలో విద్యార్థి మృతి! * ఒక కారును నడుపుతున్నది ఎమ్మెల్యే బోండా పెద్ద కుమారుడు సిద్దార్థ * బోండా కథనం ప్రకారమే కుక్క కథ! సాక్షి, గుంటూరు/విజయవాడ: గుంటూరు జిల్లా లో ‘కార్ల రేసింగ్’ను వీడియో తీసేందుకు బడా బాబుల పిల్లలు తమ వెంటబెట్టుకెళ్లిన విద్యార్థి.. ఆ కార్ల రేసింగ్‌లో ప్రమాదంతో మృతి చెందిన ఘటనను ‘కుక్క కథ’తో ముగించనున్నారా? మూడు రోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఔననే సమాధానం చెప్తున్నాయి. ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా యడ్లపాడు మం డలం తిమ్మాపురం గ్రామం చెరువు సమీపంలో జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతున్న రెండు కార్లు ఢీకొని విజయవాడ కృష్ణలంకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రాగెళ్ల విజయనాగేంద్ర మృత్యువాతపడిన విషయం తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పెద్ద కుమారుడు సిద్ధార్థ పరోక్షంగా ఈ సంఘటనకు కారకుడని తెలుస్తోంది. కానీ పోలీసులు ఈ కార్ల రేసింగ్ విషయం కానీ, అందులో సిద్ధార్థ పాత్ర కానీ ఏమీ లేకుండానే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేసులో కార్లు ఢీ కొట్టుకుందిలా... ప్రమాదానికి గురైన రెండు కార్లలో ఫార్చునర్ కారును (ఎ.పి. 37బీఏ 4646) బొండా సిద్ధార్థ నడుపుతుండగా మరో స్కోడా కారును (ఎ.పి. 31సీపీ 0999) కుప్పల శివరాం డ్రైవ్ చేస్తున్నా డు. వీరిరువురు కారు రేసింగ్ ఆడుతూ ముందు ఎమ్మెల్యే తన యుడు సిద్ధార్థ నడుపుతున్న ఫార్చ్యూనర్ వెళుతుండగా ఉప్పువాగు వంతెన సమీపంలో కొప్పు ల శివరామ్ స్కోడా కారుతో ఓవర్టేక్ చేయ బోయే క్రమంలో కార్లు ఢీకొన్నాయి. ఈ సమయంలో సిద్ధార్థ కారు డోరు పక్కనే ఉండి వీడియో తీస్తున్న నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడని చెప్తున్నారు. జరిగిన ఘటనపై నోరు విప్పేందుకు నాగేంద్ర కుటుంబీకులు సాహసించడం లేదు. తూతూ మంత్రంగా కేసు.. చట్ట విరుద్ధంగా కార్ల రేసింగ్ నిర్వహించడమే కాక ఓ విద్యార్థి మృతికి కారణమైన ఇలాంటి సందర్భాల్లో సెక్షన్ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) ఐపీసీ కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే.. యడ్లపాడు పోలీసు స్టేషన్లో మాత్రం.. చిలకలూరిపేటలో స్నేహితుడి ఇంట్లో జరిగే వేడుకలకు వెళుతూ కుక్క అడ్డురావడంతో బ్రేకు వేయగా అదుపు తప్పి కార్లు ప్రమాదానికి గురైనట్టు ఎమ్మెల్యే బొండా పేర్కొన్నట్లుగానే.. శుభకార్యానికి వెళుతూ అతివేగంతో కారు నడిపినట్లుగా సిద్ధార్థ, శివరాంలపై తూతూమంత్రంగా కేసు నమోదు చేశారు. సిద్ధార్థ, శివరాంలను రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని యడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరరావు మంగళవారం చెప్పారు. -
గుంటూరు జిల్లాలో కార్ల రేసింగ్.. యువకుడి మృతి
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్ల రేసులో ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి చిలకలూరి పేట వరకు రేసు జరిగింది. కాగా యడ్లపాడు వద్ద రేసులో పాల్గొన్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాగేంద్ర అనే యువకుడు మరణించగా, ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు.