చంద్రబాబుపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజం
‘పట్టిసీమ’ శంకుస్థాపనపై నిరసన
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన
ధవళేశ్వరం (రాజమండ్రి రూరల్) :రాష్ట్ర రైతులందరి సంక్షేమం కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టును నీరుగార్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. ‘పట్టిసీమ’కు సీఎం ఆదివారం శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధవళేశ్వరం బ్యారేజి సమీపాన సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడుతూ, నిపుణుల సలహాలు తీసుకోకుండా,సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా ‘పట్టిసీమ’కు శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ రైతు పక్షపాతి, రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఆ రైతులకు నష్టం చేకూర్చే పట్టిసీమ పథకానికి శంకుస్థాపన చేసి రైతుద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని దుయ్యబట్టారు. ‘పట్టిసీమ’ శంకుస్థాపనకు రోడ్డు మార్గాన వెళ్తే రైతులు అడ్డుకుంటారన్న భయంతోనే ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ‘పట్టిసీమ’ పనులను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలవరం కుడికాలువపై 45 కిలోమీటర్ల మేర ఇంకా కాలువలే తవ్వలేదని, ఇందుకు సంబంధించిన భూ వివాదాలు కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నాయని,
ఈ పరిస్థితుల్లో కేవలం ఏడాది కాలంలో కాలువల నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల నుంచి సొమ్ములు ‘లిఫ్ట్’ చేసేందుకే ‘పట్టిసీమ’ నిర్మిస్తున్నారన్నారు. ఈ పథకంవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ, రాయలసీమలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, గాలేరు-నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రాయలసీమకు నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల రైతు నాయకులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ఈ పథకానికి సీఎం శంకుస్థాపన చేయడం సరికాదన్నారు. ఇందుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, విదేశీయుడైన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తే, ప్రస్తుత పాలకులు రైతులకు అన్యాయం చేసే ప్రాజెక్టులను నిర్మించడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటివినియోగదారుల సంఘాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ నాయకులు, ఇరిగేషన్ విశ్రాంత ఈఈ విప్పర్తి వేణుగోపాలరావులు మాట్లాడుతూ, ‘పట్టిసీమ’వల్ల ఉభయ గోదావరి జిల్లాల రైతులకు జరిగే నష్టాలను వివరించారు. వైఎస్సార్‌సీపీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఎత్తిపోతలు ద్వారా తరలిస్తే, ఆ నీరు ఎగువ భాగాన ఉన్న రాయలసీమకు ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తొలుత పార్టీ నేతలు ఆర్థర్ కాటన్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, నక్కా రాజబాబు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, మింది నాగేంద్ర, బడుగు ప్రశాంత్‌కుమార్ (చిన్ని), దొండపాటి సత్యంబాబు, మార్తి నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మాసా రామజోగ్, జిల్లా సేవాదళ్ చైర్మన్ మార్గాని గంగాధర్, పార్టీ నాయకులు రావిపాటి రామచంద్రరావు, ఆదిరెడ్డి వాసు, అడపా హరి, కముజు సత్యనారాయణ, సంగీత వెంకటేశ్వరరావు, దాసరి శేషగిరి, జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, ఎంపీపీ కోట చల్లయ్య, వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ తదితరులు పాల్గొన్నారు.
పోల‘వరాన్ని’నీరుగార్చేందుకే..
Published Mon, Mar 30 2015 2:45 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement