►బీదకు అధ్యక్ష పదవి ఇవ్వటంతో లైన్‌క్లియర్
►నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి నామినేషన్
►సోమిరెడ్డి వర్గీయుల్లో ఆనందం..
►బీద వర్గీయుల్లో నిరుత్సాహం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ జిల్లా నేతలను ఊరిస్తూ వస్తున్న ఎమ్మెల్సీ పదవికి అధినేత చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం సోమిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. సోమిరెడ్డి పేరు ప్రకటించటంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ కోటా కింద, ఎమ్మెల్యేల కోటా కింద శాసనమండలి స్థానాలు భర్తీ చేయనున్నారు.
వాటిలో ఒకదాని కోసం సోమిరెడ్డి, బీద పేర్లు జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ కమిటీ ఎన్నికల్లో బీద రవిచంద్రకు మరోసారి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో సోమిరెడ్డికి లైన్‌క్లియర్ అయింది. ఇదేస్థానాన్ని రవిచంద్ర కూడా ఆశించారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన పేరు అధిష్టానం ఖరారుచేసిందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరిక్షణంలో అధినేత చంద్రబాబు జిల్లాకు మొండిచేయి చూపారు. దీంతో జిల్లా టీడీపీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు.
లోపల అధినేతపై అసంతృప్తి ఉన్నా.. టీడీపీ శ్రేణులు ఎక్కడా బయటపడలేదు. తాజాగా మరోసారి శాసనమండలి స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వటంతో మరోసారి ఆశలు చిగురించాయి. రేసులో సోమిరెడ్డితో పాటు బీద పేరు వినిపించినా... తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రమోహన్‌రెడ్డి పేరు గవర్నర్ కోటా కింద ఖరారు చేశా రు. బీదకు అధ్యక్షపదవిని కట్టబెట్టటం, జిల్లాలో రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండటంతో సోమిరెడ్డికే ఇవ్వాలని పలువురు పట్టుబట్టినట్లు తెలిసింది.
సీనియారిటీ వైపే మొగ్గు
టీడీపీలో సీనియర్ నేతగా పేరున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 1990లో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో సోమిరెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. క్రీడలు, సినిమాటోగ్రఫీ, యువజన సర్వీసులు తదిరతశాఖలకు రెండేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. అనంతరం 2001 నుంచి 2004 వరకు సమాచారశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు. కోవూరు ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు. ఆ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవ్వటంతో ఎమ్మెల్సీపై ఆశలుపెట్టుకున్నారు. గవర్నర్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో జరగుబోయే ఎన్నికల్లో ఏదో ఒకదాని నుంచి శాసనమండలికి ఎంపికై మంత్రి కావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా గవర్నర్ కోటాలో సోమిరెడ్డి స్థానం దక్కించుకున్నారు. సోమిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయటంతో జిల్లాలో ఆయన వర్గీయులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
సోమిరెడ్డికే ఎమ్మెల్సీ
Published Thu, May 21 2015 6:06 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement