కరువు సీమపై ఇంత నిర్లక్ష్యమా?
► ప్రభుత్వంపై ధ్వజమెత్తిన
► ఎమ్మెల్సీ గేయానంద్
► కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
కర్నూలు (న్యూసిటీ): వరుస కరువులతో అల్లాడుతున్న సీమ ప్రాంతంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. తాగునీరు కూడా లభించక ప్రజలు నిత్యం బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు. కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గేయానంద్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుండడం ఆయన చేతకాని తనమేనని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద యం త్రాల వినియోగం తగ్గించి కూలీలకు పనులు కల్పించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో రైతు సంఘం నేతలు ఆంజనేయుడు, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, నగర నాయకులు పుల్లారెడ్డి, రాజశేఖర్, వివిధ సంఘాల నాయకులు వెంకట్రాముడు, సి.గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం నీటి ముంపు బాధితుల ధర్నా
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో శ్రీశైలం నీటి ముంపు బాధితులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధితుల సంఘం నాయకుడు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 1996లో జీఓ నెంబర్ 98 జారీ చేశారన్నారు. దీని ప్రకారం కేటగిరీల వారీగా జిల్లాలో పలువురికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం చాలా మందిని పట్టించుకోలేదన్నా రు. ఇదే జీఓ ప్రకారం ఇటీవలే ప్రకాశం జిల్లాలో బాధితులకు ఉద్యోగాలిచ్చారని, ఇక్కడ మాత్రం వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం ఎమ్మెల్సీ డా.గేయానంద్‌కు వినతిపత్రం అందించారు. మండలిలో చర్చించి న్యాయం చేయాలని కోరా రు. బాధితులు ఎస్ మక్బూల్‌బాషా, మోహీన్‌బాషా, ఏ జనార్దన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.