అనంత కవితా స్వరాలు పుస్తకావిష్కరణలో ఎమ్మెల్సీ గేయానంద్
అనంతపురం కల్చరల్ : సమాజానికి ఎదురీదే స్వభావం కలవారిలోనే కవితావేశం దాగుంటుందని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ‘అనంత కవితా స్వరాలు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పిళ్ళా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గేయానంద్, ఆచార్య మేడిపల్లి రవికుమార్, ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ, ప్రజ్ఞాసురేష్ హాజరయ్యారు. గేయానంద్ మాట్లాడుతూ 71 మంది కవులు, కవియిత్రులు వివిధ కథా వస్తువులను తీసుకుని ఆలోచింపజేసే విధంగా రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
సింగమనేని మాట్లాడుతూ చదవాలనిపించే సాహిత్యం అడుగంటిపోతున్న తరుణంలో సాహితీ స్రవంతి మరోసారి పాఠకుల హృదయాలకు దగ్గరగా ఉండే కథా వస్తువులతో పుస్తకాన్ని సాహితీ లోకానికి అందించడం అభినందనీయమన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ఎస్వీయూ ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ పుస్తక సమీక్ష చేశారు. అనంతరం అనంత కవితా స్వరాలలో భాగస్వామ్యం వహించిన కవులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో శేషాచార్యులు అనంత వైభవాన్ని కీర్తిస్తూ పద్య పఠనం చేశారు. సాహితీ స్రవంతి సభ్యులు తగరం క్రిష్ణయ్య, రియాజుద్దీన్, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, ఆచార్య పిఎల్ శ్రీనివాసరెడ్డి, చెట్ల ఈరన్న, శేఖర్, జెన్నే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సమాజానికి ఎదురీదే వాడే కవి
Published Mon, Jun 29 2015 4:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement