పూటకో మాట..? | Mlc Kolagatla Virabhadrasvami fire on Chandra babu | Sakshi
Sakshi News home page

పూటకో మాట..?

Published Thu, May 19 2016 12:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Mlc Kolagatla Virabhadrasvami fire on  Chandra babu

 సాలూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి 30సార్లు ఢిల్లీవెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసమే వెళ్తున్నామని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీవెళ్లి ప్రత్యేక హోదా అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక మెంటాడవీధి కల్యాణమండపంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సాలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి  ఆయన మాట్లాడారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
 
 రాష్ర్ట విభజన సమయంలో ప్రత్యేక హోదా పది, పదిహేనేళ్లు కావాలని అడిగిన చంద్రబాబు.. నేడు ప్రత్యేక హోదా అవసరమా? అని అంటుండడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బొబ్బిలి రాజులు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరితే వారివెంట వెయ్యమందికి మించి వెళ్లలేదని, ప్రజలంతా వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారనేందుకు ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు.
 
 పచ్చిమోసగాడికి బుద్ధి చెబుదాం
 సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, సాలూరు జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి మాట్లాడుతూ   అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.  అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న రాజన్నదొర, పుష్పశ్రీవాణి వంటి నాయకులు తమ పార్టీలో  ఉన్నారని కొనియాడారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రి సాంబశివరాజు, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, రాష్ట్ర యువజనవిభాగం ప్రధానకార్యదర్శి పరీక్షిత్‌రాజ్, మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్రనాయకులు జరజాపు ఈశ్వరరావు, గంగమ్మ, సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు సువ్వాడ రమణ, కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 టీడీపీ మునిగిపోనున్న నావ
 సాలూరు ఎమ్మెల్యే, పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర మాట్లాడుతూ టీడీపీ మునిగిపోనున్న నావ అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతోపాటు ఇతర నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు అడుగడుగునా దగా చేస్తుంటే, ప్రతిపక్షనేత జగన్ ప్రజలపక్షాన పోరాడుతున్నారన్నారు. జగన్ సాగుజలాలకోసం జలదీక్ష చేస్తుంటే రాష్ట్ర మంత్రులేమో వ్యక్తిగత పనుల్లో బిజీగా  ఉంటున్నారని ఎద్దేవా చేశారు.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకి డిపాజిట్లు దక్కవని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement