
శమంతకమణి, బోండా ఉమామహేశ్వర రావు(ఫైల్)
అధికారమదంతో 'పచ్చ'చొక్కాలు రెచ్చిపోతున్నాయి. 'పవర్' ఉందన్న పొగరుతో ప్రతిఒక్కడిపై దాడులకు తెగబడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పటివరకు రాజకీయ దాడుల పర్వం కొనసాగించిన టీడీపీ గూండాలు ఇప్పుడు మీడియాపై రౌడీయిజం చేస్తున్నారు. అధికారం అండ చూసుకుని అడ్డుఅదుపు లేకుండా అరాచకాలు సాగిస్తున్నారు. అనంతపురం, విజయవాడలో టీడీపీ నేతలు సృష్టించిన దౌర్జన్యకాండే ఇందుకు నిదర్శనం.
అనంతపురంలో 'సాక్షి' మీడియా ప్రతినిధులపై శనివారం సైకిల్ పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం మార్చేసిన పచ్చ నేతల బాగోతాలను బయటపెట్టేందుకు వెళ్లినందుకు ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, విలేకరిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, ఇతర నేతలు ఈ దౌర్జన్యకాండకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పుత్రరత్నం కూడా గుంటూరు జిల్లాలో దాదాగిరికి దిగాడు. బైకు రేసులతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న బోండా కుమారుడిని ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. తన తండ్రి ఎమ్మెల్యే అన్న అహంకారంతో స్థానికులపై అతడు దౌర్జన్యానికి దిగాడు. ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాదాగిరి చేశాడు. ఇంతజరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టనని నిత్యం వల్లించే సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల ఆగడాలపై ఎలా స్పందిస్తారో?