దిగుమతిపై ఎంఎంటీ‘సీ’!
- బంగారం ధరలు తగ్గుతుండడంతో ఆసక్తి
- కేంద్రం పచ్చజెండా కోసం ఎదురుచూపులు
- ఆంక్షలతో జీరోకు పడిపోయిన అమ్మకాలు
- రిటైల్ అవుట్‌లెట్లు వెలవెల
సాక్షి, విశాఖపట్నం: కొండెక్కిన బంగారం ధరలు క్రమేపీ తగ్గుతుండడంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పసిడి వ్యాపారంతో కోట్లలో లాభాలు ఆర్జించిన ఈ సంస్థ ప్రస్తుతం వ్యాపారం పూర్తిగా పడిపోయి కళావిహీనంగా మారింది. ఏటా రూ.450 కోట్ల టర్నోవర్ కాస్తా సున్నాకు పడిపోయింది. మళ్లీ ఇప్పుడు ధరలు తగ్గి అమ్మకాలు పుంజుకుంటుండడంతో దిగుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభిస్తే లాభాల బాట పట్టవచ్చనే యోచనతో ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం పచ్చజెండా ఊపితే రిటైల్ అవుట్‌లెట్లలో బిస్కెట్లు, నాణేలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.
ఆశలు ఫలించేనా?
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెటల్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ)దేశానికి అవసరమైన బంగారాన్ని ఏటా విదేశాల నుంచి బిస్కెట్ల రూపంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ, హైదరాబాద్‌లోని రెండు ఎంఎంటీసీ ప్రాంతీయ కార్యాలయాలు విడివిడిగా మూడు నెలలకోసారి దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ద్వారా పసిడి బిస్కెట్లను 500, 100 గ్రాములు, అంతకు మించిన తక్కువ రూపంలో దిగుమతి చేసుకుంటున్నాయి.
వీటిలో 100 గ్రాములకు మించిన బిస్కెట్లను బులియన్ కార్పొరేషన్‌ల ద్వారా, అంతకుమించి తక్కువ బరువున్న పసిడిని సొంత రిటైల్ అవుట్‌లెట్లలో విక్రయిస్తోంది. ఈ విధంగా రెండు కార్యాలయాలు ఏటా రూ.1525 కోట్ల విలువైన 42 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేవి. ఒక్క విశాఖ ప్రాంతీయ కార్యాలయమే రూ.450 కోట్ల విలువైన 20 టన్నుల బంగారాన్ని దిగుమతి వ్యాపారం చేసేది. దేశంలోకి పసిడి దిగుమతులు అంచనాలకుమించి వచ్చిపడిపోతుండడంతో తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎంఎంటీసీ కళావిహీనంగా మారింది.
గతేడాది డిసెంబర్ నుంచి సగానికిపైగా ఆర్డర్లలో కోత విధించి క్రమక్రమంగా పూర్తిగా నిలిపివేసింది.
బంగారం వర్తకులు, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది మార్చిలో విశాఖ ఎంఎంటీసీ కార్యాలయం 10 టన్నులకు ఆర్డర్లు ఇచ్చింది. కానీ ఏప్రిల్ నుంచి పూర్తిగా ఈ దిగుమతులను కూడా నిలిపివేసింది. ఫలితంగా వ్యాపారం పడిపోయింది. కేంద్ర కార్యాలయం నుంచి 1, 2, 5, 8, 10, 20, 50 గ్రాముల రూపంలో పసిడి నాణేలను విశాఖ కార్యాలయానికి భారీగా వచ్చేవి. ఇవి కూడా నాలుగు నెలల నుంచి రాకపోవడంతో ప్రసుత్తం ఎంఎంటీసీ రిటైల్‌అవుట్‌లెట్లు కార్యకలాపాలు లేక మూతపడ్డాయి.
ఇప్పుడు పసిడి ధరలు తగ్గుతుండడం, వరుసగా పండగలు రావడంతో పసిడి విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్‌ను ఉపయోగించుకుని వ్యాపారం పెంచుకోవడానికి ఎంఎంటీసీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. మరోపక్క కేంద్రం కూడా కరెంట్‌ఖాతాలోటు ప్రస్తుతం పెద్దగా లేకపోవడంతో దిగుమతులపై ఆంక్షలు ఎత్తేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వస్తుండడంతో కేంద్రం అనుమతుల కోసం ఎంఎంటీసీ ఆశగా ఎదురుచూస్తోంది.