Retail outlets
-
క్యూకట్టిన ఎన్నా‘రైస్’.. అమెరికాలో 9 కిలోల రైస్ బ్యాగ్ రూ. 3,854
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న పండుగల సీజన్లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అమెరికా తదితర దేశాల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా అమెరికాలోని రిటైల్ ఔట్లెట్లు ఎన్నారైలతో కిటకిటలాడు తున్నాయి. తెలుగువారు ఎక్కువగా నివసించే డాలస్, అట్లాంటా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోని స్టోర్ల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సోనామసూరి రకం బియ్యానికి కొరత ఏర్పడుతుందన్న భయంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో నిషేధానికి ముందు వరకు 9.07 కిలోల బ్యాగ్‌ను 16–18 డాలర్ల (రూ.1,312 –1,476)కు విక్రయించిన స్టోర్ల నిర్వాహకులు తాజాగా దాదాపు మూడు రెట్లు అధికంగా 47 డాలర్ల (రూ. 3,854) వరకు బ్యాగ్‌ను విక్రయిస్తున్నారు. కొన్ని స్టోర్ల యజమా నులు బియ్యం బ్యాగ్‌ల కొనుగోలుపై పరిమితి విధించగా మరికొందరు నిర్ణీత మొత్తంలో ఇతర వస్తువులు కొన్న వారికే బియ్యం బ్యాగ్‌లు విక్రయిస్తామని తేల్చిచెబుతున్నారు. ఆరు నెలలకు సరిపోవచ్చు..: భారత్ నుంచి నెలకు సగటున బాస్మతీయేతర బియ్యం 6,000 మెట్రిక్ టన్నులు యూఎస్ఏకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీ వాటా 4,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని సమాచారం. ‘యూఎస్ఏలో ప్రస్తుతం సుమారు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే భారత్ నుంచి 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం యూఎస్ఏకు రవాణాలో ఉంది. ఈ నిల్వలు ఆరు నెలలకు సరిపోవచ్చు’ అని ఎగుమతిదారులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో సుమారు రూ.8,200 కోట్ల విలువైన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించే ఒప్పందాలను రద్దు చేసుకొనే పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 40 శాతం ఉంది. నెలకు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర బియ్యం భారత్ నుంచి వివిధ దేశాలకు సరఫరా అవుతోంది. ఫర్నిచర్ కొంటే బియ్యం ఫ్రీ బియ్యం కొరతను ఆసరా చేసుకొని డీఆర్ హోర్టన్ అనే అతిపెద్ద గృహ నిర్మాణ సంస్థ అమెరికాలోని 29 రాష్ట్రాల్లోని 90 మార్కెట్లలో అప్పటికప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ‘మీకు సోనా మసూరి దొరకడం లేదా? మేం మీకు సహాయం చేస్తాం. మావద్ద హోమ్ ఫర్నిచర్ కొంటే.. 15 లిబ్రా (ఎల్బీ–0.45 కేజీలు)ల సోనా మసూరి బియ్యం ఉచితంగా ఇస్తాం’ అంటూ ఆఫర్ మొదలెట్టేసింది. సోనామసూరిని మినహాయించాలి.. యూఎస్ఏ లోని భారతీయులు సోనా మసూరి బియ్యం అధికంగా వాడతా రు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిషేధం నుంచి సోనామసూరిని ప్రభుత్వం మినహాయించాలి. – కిరణ్‌కుమార్ పోల, డైరెక్టర్, డెక్కన్ గ్రెయింజ్ ఇండియా అవగాహన లేనివాళ్లే ఎక్కువ కొంటున్నారు.. భారత్ నుంచి సన్న బి య్యం ఎగుమతుల నిషే ధం శాశ్వతం కాదు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మార్కెట్, సరఫరా, డిమాండ్‌పై అవగాహన లేనివాళ్లే అవసరానికి మించి బియ్యం కొంటున్నారు. – జ్యోతి ముదునూరి, ఎన్నారై, న్యూజెర్సీ పొద్దున్నే పరుగుపెట్టాం.. సోనామసూరి బియ్యం కొర త భయంతో స్టోర్లకు పొద్దు న్నే పరుగుపెట్టాం. బ్రౌన్, రెడ్ రైస్, చైనా రైస్ దొరుకుతున్నా మేం తినేది సోనామ సూరీయే. కొందరు వారి బంధువులు, స్నేహితుల కోసం కూడా కొనుగోలు చేస్తున్నారు. – శ్రీధర్ నూగూరి,ఎన్నారై, అగస్టా (జార్జియా స్టేట్) ప్రత్యేక కోడ్‌తో అనుమతించాలి ఎగుమతులపై నిషేధంతో విదేశాల్లో బియ్యం ధరలు పెరగొచ్చు. భారతీయులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హెచ్ఎస్ఎన్ కోడ్ కింద సోనా మసూరి రకాల ఎగుమతికి కేంద్రం అనుమతించాలి. – బీవీ కృష్ణారావు, అధ్యక్షుడు, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం -
దుకాన్‌లైన్ చేతికి మైస్టోర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ అగ్రిగేటర్ దుకాన్‌లైన్ ఇండియా తాజాగా మైస్టోర్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా 21,800 మంది విక్రేతలకు అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తున్నట్టు దుకాన్‌లైన్ చైర్మన్ కృష్ణ లకంసాని శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో విస్తరణలో భాగంగానే మైస్టోర్స్ను చేజిక్కించుకున్నట్టు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 117 రిటైల్ ఔట్లెట్లను తెరిచామని మైస్టోర్ ఫౌండర్ పోతిని శ్రీనివాసరావు తెలిపారు. చిన్న నగరాల్లో మరిన్ని స్టోర్లను నెలకొల్పుతున్నట్టు వెల్లడించారు. ఇకనుంచి ‘దుకాన్‌లైన్ మైస్టోర్’ పేరుతో స్టోర్లను నిర్వహిస్తారు. కాగా, 950కిపైగా బ్రాండ్ల ఉత్పత్తులను కస్టమర్లు ఆన్లైన్లో బుక్‌చేసుకునేలా దుకాన్‌లైన్ భాగస్వామ్య షాపుల్లో కియోస్క్‌లు ఉంటాయి. -
యాపిల్ కలలు పండనున్నాయా..?
న్యూఢిల్లీ : భారత మార్కెట్ పై యాపిల్ పెట్టుకున్న ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి. సొంత రిటైల్ స్టోర్లను భారత్ లో ఏర్పాటు చేసుకోవడానికి స్థానిక నిబంధనల నుంచి రెండు, మూడేళ్ల పాటు యాపిల్ కు కేంద్రప్రభుత్వం ఉపశమనం ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రారంభంలో ఎలాంటి స్థానిక నిబంధనలు అవసరం లేకుండా రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కు, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ)కి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. యాపిల్ కు ఇటీవలే భారత్ లో రిటైల్ స్టోర్లు ఏర్పాటుచేసుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి అనుమతులు లభించాయి. ఎఫ్ డీఐ నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రీటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి కల్పించింది. కానీ మూడింట ఒక వంతు కాంపోనెంట్స్ భారత్ కు చెందినవే ఉండాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ఆర్థిక శాఖ చెప్పింది. స్థానిక ఉద్యోగవకాశాలను, పరిశ్రమను అభివృద్ధి చేయడమే ఈ నిబంధ ఉద్దేశమని స్పష్టం చేసింది. అయితే యాపిల్ కు స్థానిక నిబంధనల నుంచి ఉపశమనం ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తుందని గతవారమే వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఆర్థిక శాఖ ససేమిరా అంటున్నా.. యాపిల్ కు స్థానిక నిబంధనల నుంచి కొంత కాలం ఉపశమనం కలుగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్నేళ్లపాటు యాపిల్ కు ఈ నిబంధనల నుంచి ఉపశమనం ఇవ్వడం వల్ల కంపెనీ తన అవసరాలను మాత్రమే పూరించుకోగలదని, స్థానిక వర్తకులపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంటున్నాయి. ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్టు తెలుపుతున్నాయి. -
దిగుమతిపై ఎంఎంటీ‘సీ’!
- బంగారం ధరలు తగ్గుతుండడంతో ఆసక్తి - కేంద్రం పచ్చజెండా కోసం ఎదురుచూపులు - ఆంక్షలతో జీరోకు పడిపోయిన అమ్మకాలు - రిటైల్ అవుట్లెట్లు వెలవెల సాక్షి, విశాఖపట్నం: కొండెక్కిన బంగారం ధరలు క్రమేపీ తగ్గుతుండడంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పసిడి వ్యాపారంతో కోట్లలో లాభాలు ఆర్జించిన ఈ సంస్థ ప్రస్తుతం వ్యాపారం పూర్తిగా పడిపోయి కళావిహీనంగా మారింది. ఏటా రూ.450 కోట్ల టర్నోవర్ కాస్తా సున్నాకు పడిపోయింది. మళ్లీ ఇప్పుడు ధరలు తగ్గి అమ్మకాలు పుంజుకుంటుండడంతో దిగుమతుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభిస్తే లాభాల బాట పట్టవచ్చనే యోచనతో ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం పచ్చజెండా ఊపితే రిటైల్ అవుట్లెట్లలో బిస్కెట్లు, నాణేలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఆశలు ఫలించేనా? కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెటల్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ)దేశానికి అవసరమైన బంగారాన్ని ఏటా విదేశాల నుంచి బిస్కెట్ల రూపంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ, హైదరాబాద్‌లోని రెండు ఎంఎంటీసీ ప్రాంతీయ కార్యాలయాలు విడివిడిగా మూడు నెలలకోసారి దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా పసిడి బిస్కెట్లను 500, 100 గ్రాములు, అంతకు మించిన తక్కువ రూపంలో దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిలో 100 గ్రాములకు మించిన బిస్కెట్లను బులియన్ కార్పొరేషన్ల ద్వారా, అంతకుమించి తక్కువ బరువున్న పసిడిని సొంత రిటైల్ అవుట్లెట్లలో విక్రయిస్తోంది. ఈ విధంగా రెండు కార్యాలయాలు ఏటా రూ.1525 కోట్ల విలువైన 42 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేవి. ఒక్క విశాఖ ప్రాంతీయ కార్యాలయమే రూ.450 కోట్ల విలువైన 20 టన్నుల బంగారాన్ని దిగుమతి వ్యాపారం చేసేది. దేశంలోకి పసిడి దిగుమతులు అంచనాలకుమించి వచ్చిపడిపోతుండడంతో తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎంఎంటీసీ కళావిహీనంగా మారింది. గతేడాది డిసెంబర్ నుంచి సగానికిపైగా ఆర్డర్లలో కోత విధించి క్రమక్రమంగా పూర్తిగా నిలిపివేసింది. బంగారం వర్తకులు, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది మార్చిలో విశాఖ ఎంఎంటీసీ కార్యాలయం 10 టన్నులకు ఆర్డర్లు ఇచ్చింది. కానీ ఏప్రిల్ నుంచి పూర్తిగా ఈ దిగుమతులను కూడా నిలిపివేసింది. ఫలితంగా వ్యాపారం పడిపోయింది. కేంద్ర కార్యాలయం నుంచి 1, 2, 5, 8, 10, 20, 50 గ్రాముల రూపంలో పసిడి నాణేలను విశాఖ కార్యాలయానికి భారీగా వచ్చేవి. ఇవి కూడా నాలుగు నెలల నుంచి రాకపోవడంతో ప్రసుత్తం ఎంఎంటీసీ రిటైల్అవుట్లెట్లు కార్యకలాపాలు లేక మూతపడ్డాయి. ఇప్పుడు పసిడి ధరలు తగ్గుతుండడం, వరుసగా పండగలు రావడంతో పసిడి విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్‌ను ఉపయోగించుకుని వ్యాపారం పెంచుకోవడానికి ఎంఎంటీసీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. మరోపక్క కేంద్రం కూడా కరెంట్ఖాతాలోటు ప్రస్తుతం పెద్దగా లేకపోవడంతో దిగుమతులపై ఆంక్షలు ఎత్తేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వస్తుండడంతో కేంద్రం అనుమతుల కోసం ఎంఎంటీసీ ఆశగా ఎదురుచూస్తోంది. -
ప్రతి బాటిల్‌కు బిల్లు తప్పనిసరి
తెలంగాణకు నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. తొలుత మద్యం రిటైల్ ఔట్లెట్స్ (వైన్‌షాపులు)కు సంబంధించిన పాలసీని ప్రకటించింది. డ్రా పద్ధతి ద్వారానే కొత్త రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపుల కేటాయింపు జరగనుంది. ఇక రిటైలర్ అమ్మే ప్రతి మద్యం సీసాకు కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి. మద్యం సీసాపై హోలోగ్రామ్‌తోపాటు2డీ బార్కోడ్ల ముద్రణ ఎంఆర్పీ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు ప్రతి వైన్‌షాపులో కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దులకు నిర్ణయం పాత విధానం తరహాలో డ్రా పద్ధతి ద్వారానే వైన్‌షాపుల కేటాయింపు గ్రేటర్లో రూ.1.04 కోట్ల నుంచి రూ.90 లక్షలకు తగ్గిన లెసైన్సు ఫీజు వరంగల్, కరీంనగర్‌లలో మాత్రం రూ.4 లక్షల పెంపు త్వరలో బార్లు, కల్లు దుకాణాలపై విధాన ప్రకటన సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఎక్సైజ్ సంవత్సరం జూన్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో తొలుత మద్యం రిటైల్ ఔట్లెట్స్ (వైన్‌షాపులు)కు సంబంధించిన పాలసీని ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్ణయించిన డ్రా పద్ధతి ద్వారానే కొత్త రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపుల కేటాయింపు జరగనుంది. గ్రామాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వరకు జనాభా ఆధారంగా ఆరు స్లాబ్‌ల ద్వారా లెసైన్స్ ఫీజును నిర్ణయించి, మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లెసైన్స్ ఫీజును రూ.1.04 కోట్ల నుంచి రూ.90 లక్షలకు తగ్గించింది. కరీంనగర్, వరంగల్ నగరాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న ఫీజు కన్నా అదనంగా రూ.4 లక్షలకు పెంచింది. అలాగే లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లకు పైగా అమ్మకాలు సాగితే ప్రస్తుతం వసూలు చేస్తున్న 14.01 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 13.6 శాతానికి తగ్గించింది. కొత్తగా మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్ కోడ్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా రిటైలర్ అమ్మే ప్రతి మద్యం సీసాకు కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి చేశారు. ప్రతి వైన్‌షాపులో కంప్యూటర్, స్కానర్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా జీవో (ఎంఎస్ నెంబర్ 2)ను విడుదల చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రూ.10,500 కోట్ల ఆదాయం! కొత్త మద్యం విధానం ద్వారా రాష్ట్రంలో రూ.10,500 కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు తెలంగాణలో రూ.9,481 కోట్ల ఆదాయం రాగా, ఆ మొత్తం సాధారణంగా పది శాతం పెరుగుతుంది. తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన మద్యం విధానంలోని లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ట్యాక్స్ కారణంగా 292 షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రెంటల్స్ రూపంలో రావాల్సిన రూ.1,080 కోట్లకు గాను రూ.931 కోట్లు మాత్రమే ఎక్సైజ్ శాఖకు వచ్చింది. ఈ లెక్కన రూ.250 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ వార్షికాదాయాన్ని కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో తగ్గిన లెసైన్ ్స ఫీజు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధానాన్నే కొనసాగిస్తూ నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే రిటైల్ ఔట్లెట్ల విషయంలో మద్యం వ్యాపారులకు కొంత ఉపశమనాన్ని కల్పించింది. గ్రేటర్ పరిధిలోని 503 మద్యం దుకాణాలకుగాను ఎక్కడ షాపు ఏర్పాటు చేయాలన్నా.. లెసైన్సు ఫీజును రూ.1.04 కోట్లుగా నిర్ణయించారు. దీంతో 175 ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం తాజాగా గ్రేటర్లో లెసైన్స్ ఫీజును రూ.90 లక్షలకు తగ్గించింది. అయితే కరీంనగర్ నగరంలోని 22 దుకాణాలకు సంబంధించి ఇప్పటి వరకున్న రూ.46 లక్షల లెసైన్స్ ఫీజును రూ.50 లక్షలకు, వరంగల్ నగరంలోని 37 దుకాణాలకు ప్రస్తుతం ఉన్న రూ.64 లక్షల ఫీజును రూ.68 లక్షలకు పెంచారు. ప్రివిలేజ్ ట్యాక్స్‌లో కొంత ఊరట 2012లో రూపొందించిన ఎక్సైజ్ విధానం ప్రకారం.. లెసైన్స్ ఫీజుకు 6 రెట్ల కన్నా అధికంగా జరిగిన మద్యం అమ్మకాలపై 15.01 శాతం మేర ప్రివిలేజ్ ట్యాక్స్‌గా మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసేలా నిబంధనలున్నాయి. దీనిపై మద్యం వ్యాపారుల నుంచి వ్యతిరేకత రావడంతో స్వల్ప సవరణలు చేశారు. లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్ల కన్నా అధికంగా అమ్మకాలు జరిపితే ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 14.01 శాతంగా మారుస్తూ 2013లో నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కొత్త పాలసీలో దాన్ని కూడా తగ్గించి 13.06 శాతంగా నిర్ణయించారు. తద్వారా గతంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ముందుకురాని ప్రాంతాల్లో కూడా దుకాణాలు తెరవవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బార్ కోడ్లు... ఎప్పటికప్పుడు దాడులు కొత్త మద్యం విధానంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో మద్యం బాటిళ్లపై బార్కోడ్ల ముద్రణ, అమ్మకాలపై బిల్లింగ్ తప్పనిసరి చేయడం. ఈ మేరకు డిస్టిలరీల్లో తయారయ్యే మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్‌కోడ్‌లను ఏర్పాటు చేస్తారు. తద్వారా డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు, అక్కడి నుంచి దుకాణాలకు, కొనుగోలుదారుల వద్దకు వెళ్లే బాటిళ్లకు సంబంధించి ట్రాకింగ్ రికార్డు అవుతుంది. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసే మద్యం వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్, స్కానర్ దుకాణంలో ఏర్పాటు చేసి, అమ్మకం సాగించే ప్రతి బాటిల్‌కు బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రిటైలర్ ఎంఆర్పీ రేటు కన్నా అధికంగా మద్యం అమ్మే అవకాశం ఉండదని మంత్రి పద్మారావు, ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ విలేకరులకు తెలిపారు. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వమే తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎంఆర్పీ ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కూడా ఇక నుంచి కఠిన చర్యలు ఉంటాయని, తొలిసారి ఉల్లంఘనలు నమోదైతే రూ.20వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా, రెండోసారైతే రూ.2లక్షల జరిమానా విధించి, మూడోసారి పునరావృతమైతే లెసైన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. కల్లు దుకాణాలపై విధివిధానాలు రూపొందిస్తున్నాం హైదరాబాద్‌లో 2004లో మూసేసిన కల్లు దుకాణాలు తెరిపించాలని గత కొన్నేళ్లుగా గీత కార్మికులు కోరుతున్నారని, దీనిపై కేసీఆర్ పలుమార్లు హామీ ఇవ్వడంతో పాటు శుక్రవారం అసెంబ్లీలో కూడా స్పష్టత ఇచ్చారని మంత్రి పద్మారావు చెప్పారు. అయితే కల్లు దుకాణాలు ఎప్పుడు పునఃప్రారంభించేది.. ఏ విధానంలో దుకాణాల నిర్వహణ జరపాలన్న విషయంపై విధి విధానాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పారు. ఈ ఎక్సైజ్ పాలసీకి కల్లు దుకాణాలకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వైన్‌షాపులకు సంబంధించిందేనని స్పష్టం చేశారు. బార్లకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బెల్ట్‌షాపులు తొలగించాం తెలంగాణలో ఎన్నికల ముందే 5 వేల బెల్టుషాపులను మూసివేయించడం జరిగిందని, ప్రస్తుతం ఎక్కడైనా ఉన్నా వాటిని కూడా లేకుండా చేస్తామని మంత్రి పద్మారావు, కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా మద్యం వ్యాపారులు అమ్మకాలు సాగించాల్సి ఉంటుందని, ఈ విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టంచేశారు. -
కొనాలంటే... 'టచ్' చెయ్.!
సెల్‌ఫోన్ ఎంపికలో కస్టమర్ల ధోరణి ఇది.. లైవ్ డెమో చూశాకే కొనుగోలు 99 శాతం కస్టమర్లు ఈ కోవలోకే అంతకంతకూ విస్తరిస్తున్న మొబైల్ ఔట్లెట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎంచుకోవడానికి విభిన్న మోడళ్లు, సలహాలు ఇచ్చేందుకు, సందేహాలు తీర్చేందుకు నిపుణులు, విక్రయానంతర సేవలు.. దీనికితోడు ఈఎంఐ సౌకర్యం.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కస్టమర్లు మొబైల్ ఫోన్‌ను కొనేందుకు రిటైల్ ఔట్లెట్లలో అడుగు పెడుతున్నారట. మరో ప్రధాన అంశమేమంటే 99 శాతంపైగా కస్టమర్లు మొబైల్పట్ల ‘టచ్ అండ్ ఫీల్’ అవ్వాల్సిందేనని అంటున్నారు. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఎటుచూసినా సెల్‌ఫోన్ విక్రయశాలలు కొత్త రూపుతో దర్శనమిస్తున్నాయి. దేశంలో సుమారు రూ. 40 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల మార్కెట్లో చైన్ స్టోర్ల వాటా 2011లో 12 శాతం కాగా, 2015 నాటికి 18 శాతానికి చేరుతుందని అంచనా. అనుభూతి చెందాల్సిందే.. ‘కొన్ని ఇ-కామర్స్ పోర్టల్స్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తక్కువ ధరకు విక్రయిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. వాస్తవానికి కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనేవారే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ. వీరు మొబైల్స్‌ను ప్రత్యక్షంగా చూస్తేనే కొంటారు’ అని యూనివర్సెల్ ఫౌండర్ డి.సతీష్‌బాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రత్యేకత కోరుకునే వారికోసం వివిధ కంపెనీలకు చెందిన కొన్ని సెల్ఫోన్లు కేవలం తమ స్టోర్లలో మాత్రమే లభిస్తాయని చెప్పారు. తమ సంస్థకు 450 ఔట్లెట్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని చిన్న పట్టణాల్లో ఫ్రాంచైజీ విధానంలో 200 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కస్టమర్లు డబ్బులు వెచ్చిస్తున్నారు. మొబైల్‌ను సృ్పశించి, అనుభూతి చెందేందుకే వారు మొగ్గు చూపుతారని నోకియా ఇండియా దక్షిణప్రాంత డెరైక్టర్ టీఎస్ శ్రీధర్ తెలిపారు. లైవ్ డెమో కోసం.. మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్లను ఔట్లెట్లు విస్తృత స్థాయిలో డిస్ప్లే చేస్తున్నాయి. కొన్ని రిటైల్ చైన్లు ‘లైవ్’ పేరుతో ప్రత్యేకంగా విశాలమైన స్టోర్లను తెరుస్తున్నాయి. వినియోగదారుల సౌకర్యార్థం డమ్మీకి బదులు అసలు ఫోన్లను ప్రదర్శిస్తున్నామని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్లలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. ఫీచర్లను వివరించేందుకు ఔట్లెట్ల సిబ్బందితోపాటు మొబైల్ ఫోన్ తయారీ కంపెనీల ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. 50కి పైగా ఔట్లెట్స్ ఉన్న లాట్ మొబైల్స్ ఒక అడుగు ముందుకేసి స్మార్ట్ మ్యాచ్ మేకర్, వర్చువల్ రియాలిటీ అనే అప్లికేషన్లను వినియోగిస్తోంది. భారీ విస్తరణ దిశగా.. సెల్ఫోన్ల విక్రయ రంగంలో అపార అవకాశాలున్నాయి కాబట్టే తయారీ కంపెనీలు, రిటైల్ సంస్థలు భారీగా విస్తరిస్తున్నాయి. నోకియా, శాంసంగ్, సోనీ, మైక్రోమ్యాక్స్, స్పైస్ వంటి కంపెనీలు అన్ని పట్టణాల్లో స్టోర్లను పెంచుతూ పోతున్నాయి. నోకియాకు 500 పైగా ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు, 2 లక్షలకుపైగా టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇక సెల్కాన్ సైతం ఫ్రాంచైజీ విధానంలో ఔట్లెట్లను నెలకొల్పే ప్రయత్నాల్లో ఉంది. 125కుపైగా స్టోర్లున్న బిగ్ సి నెలకు ఒక లక్షకు పైచిలుకు ఫోన్లను విక్రయిస్తోంది. 2015 డిసెంబరుకల్లా మరో 300 స్టోర్లు ఏర్పాటు చేయాలని లాట్ మొబైల్స్ కృతనిశ్చయంతో ఉంది. 70 లక్షల మంది కస్టమర్లు తమకు ఉన్నారని, నెలకు 70 వేల మంది కొత్తగా వచ్చి చేరుతున్నారని సంగీత మొబైల్స్ అంటోంది. రూ.500 కోట్లకుపైగా టర్నోవర్ కలిగిన ఈ సంస్థకు ఏడు రాష్ట్రాల్లో 250 ఔట్లెట్లు ఉన్నాయి.