హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న పండుగల సీజన్‌లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అమెరికా తదితర దేశాల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా అమెరికాలోని రిటైల్ ఔట్‌లెట్లు ఎన్నారైలతో కిటకిటలాడు తున్నాయి.
తెలుగువారు ఎక్కువగా నివసించే డాలస్, అట్లాంటా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోని స్టోర్ల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. సోనామసూరి రకం బియ్యానికి కొరత ఏర్పడుతుందన్న భయంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు.
దీంతో నిషేధానికి ముందు వరకు 9.07 కిలోల బ్యాగ్‌ను 16–18 డాలర్ల (రూ.1,312 –1,476)కు విక్రయించిన స్టోర్ల నిర్వాహకులు తాజాగా దాదాపు మూడు రెట్లు అధికంగా 47 డాలర్ల (రూ. 3,854) వరకు బ్యాగ్‌ను విక్రయిస్తున్నారు. కొన్ని స్టోర్ల యజమా నులు బియ్యం బ్యాగ్‌ల కొనుగోలుపై పరిమితి విధించగా మరికొందరు నిర్ణీత మొత్తంలో ఇతర వస్తువులు కొన్న వారికే బియ్యం బ్యాగ్‌లు విక్రయిస్తామని తేల్చిచెబుతున్నారు.
ఆరు నెలలకు సరిపోవచ్చు..: భారత్ నుంచి నెలకు సగటున బాస్మతీయేతర బియ్యం 6,000 మెట్రిక్ టన్నులు యూఎస్‌ఏకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీ వాటా 4,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని సమాచారం. ‘యూఎస్‌ఏలో ప్రస్తుతం సుమారు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే భారత్ నుంచి 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం యూఎస్‌ఏకు రవాణాలో ఉంది.
ఈ నిల్వలు ఆరు నెలలకు సరిపోవచ్చు’ అని ఎగుమతిదారులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో సుమారు రూ.8,200 కోట్ల విలువైన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించే ఒప్పందాలను రద్దు చేసుకొనే పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 40 శాతం ఉంది. నెలకు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర బియ్యం భారత్ నుంచి వివిధ దేశాలకు సరఫరా అవుతోంది.
ఫర్నిచర్ కొంటే బియ్యం ఫ్రీ
బియ్యం కొరతను ఆసరా చేసుకొని డీఆర్ హోర్టన్ అనే అతిపెద్ద గృహ నిర్మాణ సంస్థ అమెరికాలోని 29 రాష్ట్రాల్లోని 90 మార్కెట్లలో అప్పటికప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ‘మీకు సోనా మసూరి దొరకడం లేదా? మేం మీకు సహాయం చేస్తాం. మావద్ద హోమ్ ఫర్నిచర్ కొంటే.. 15 లిబ్రా (ఎల్‌బీ–0.45 కేజీలు)ల సోనా మసూరి బియ్యం ఉచితంగా ఇస్తాం’ అంటూ ఆఫర్ మొదలెట్టేసింది.
సోనామసూరిని మినహాయించాలి..
యూఎస్‌ఏ లోని భారతీయులు సోనా మసూరి బియ్యం అధికంగా వాడతా రు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిషేధం నుంచి సోనామసూరిని ప్రభుత్వం మినహాయించాలి.
– కిరణ్‌కుమార్ పోల, డైరెక్టర్, డెక్కన్ గ్రెయింజ్ ఇండియా
అవగాహన లేనివాళ్లే ఎక్కువ కొంటున్నారు..
భారత్ నుంచి సన్న బి య్యం ఎగుమతుల నిషే ధం శాశ్వతం కాదు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మార్కెట్, సరఫరా, డిమాండ్‌పై అవగాహన లేనివాళ్లే అవసరానికి మించి బియ్యం కొంటున్నారు. – జ్యోతి ముదునూరి, ఎన్నారై, న్యూజెర్సీ
పొద్దున్నే పరుగుపెట్టాం..
సోనామసూరి బియ్యం కొర త భయంతో స్టోర్లకు పొద్దు న్నే పరుగుపెట్టాం. బ్రౌన్, రెడ్ రైస్, చైనా రైస్ దొరుకుతున్నా మేం తినేది సోనామ సూరీయే. కొందరు వారి బంధువులు, స్నేహితుల కోసం కూడా కొనుగోలు చేస్తున్నారు. – శ్రీధర్ నూగూరి,ఎన్నారై, అగస్టా (జార్జియా స్టేట్)
ప్రత్యేక కోడ్‌తో అనుమతించాలి
ఎగుమతులపై నిషేధంతో విదేశాల్లో బియ్యం ధరలు పెరగొచ్చు. భారతీయులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ కింద సోనా మసూరి రకాల ఎగుమతికి కేంద్రం అనుమతించాలి. – బీవీ కృష్ణారావు, అధ్యక్షుడు, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment