కొనాలంటే... 'టచ్' చెయ్.! | touch mobile is compulsary now a days | Sakshi
Sakshi News home page

కొనకొనాలంటే... 'టచ్' చెయ్.!

Published Thu, Dec 26 2013 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

కొనాలంటే... 'టచ్' చెయ్.!

కొనాలంటే... 'టచ్' చెయ్.!

 సెల్‌ఫోన్ ఎంపికలో కస్టమర్ల ధోరణి ఇది..
 లైవ్ డెమో చూశాకే కొనుగోలు    99 శాతం కస్టమర్లు ఈ కోవలోకే
 అంతకంతకూ విస్తరిస్తున్న మొబైల్ ఔట్‌లెట్లు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎంచుకోవడానికి విభిన్న మోడళ్లు, సలహాలు ఇచ్చేందుకు, సందేహాలు తీర్చేందుకు నిపుణులు, విక్రయానంతర సేవలు.. దీనికితోడు ఈఎంఐ సౌకర్యం.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కస్టమర్లు మొబైల్ ఫోన్‌ను కొనేందుకు రిటైల్ ఔట్‌లెట్లలో అడుగు పెడుతున్నారట. మరో ప్రధాన అంశమేమంటే 99 శాతంపైగా కస్టమర్లు మొబైల్‌పట్ల ‘టచ్ అండ్ ఫీల్’ అవ్వాల్సిందేనని అంటున్నారు. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఎటుచూసినా సెల్‌ఫోన్ విక్రయశాలలు కొత్త రూపుతో దర్శనమిస్తున్నాయి. దేశంలో సుమారు రూ. 40 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల మార్కెట్లో చైన్ స్టోర్ల వాటా 2011లో 12 శాతం కాగా, 2015 నాటికి 18 శాతానికి చేరుతుందని అంచనా.
 
 అనుభూతి చెందాల్సిందే..
 ‘కొన్ని ఇ-కామర్స్ పోర్టల్స్ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తక్కువ ధరకు విక్రయిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. వాస్తవానికి కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనేవారే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ. వీరు మొబైల్స్‌ను ప్రత్యక్షంగా చూస్తేనే కొంటారు’ అని యూనివర్‌సెల్ ఫౌండర్ డి.సతీష్‌బాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రత్యేకత కోరుకునే వారికోసం వివిధ కంపెనీలకు చెందిన కొన్ని సెల్‌ఫోన్లు కేవలం తమ స్టోర్లలో మాత్రమే లభిస్తాయని చెప్పారు. తమ సంస్థకు 450 ఔట్‌లెట్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని చిన్న పట్టణాల్లో ఫ్రాంచైజీ విధానంలో 200 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కస్టమర్లు డబ్బులు వెచ్చిస్తున్నారు. మొబైల్‌ను సృ్పశించి, అనుభూతి చెందేందుకే వారు మొగ్గు చూపుతారని నోకియా ఇండియా దక్షిణప్రాంత డెరైక్టర్ టీఎస్ శ్రీధర్ తెలిపారు.
 
 లైవ్ డెమో కోసం..
 మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్లను ఔట్‌లెట్లు విస్తృత స్థాయిలో డిస్‌ప్లే చేస్తున్నాయి. కొన్ని రిటైల్ చైన్లు ‘లైవ్’ పేరుతో ప్రత్యేకంగా విశాలమైన స్టోర్లను తెరుస్తున్నాయి. వినియోగదారుల సౌకర్యార్థం డమ్మీకి బదులు అసలు ఫోన్లను ప్రదర్శిస్తున్నామని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్లలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. ఫీచర్లను వివరించేందుకు ఔట్‌లెట్ల సిబ్బందితోపాటు మొబైల్ ఫోన్ తయారీ కంపెనీల ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. 50కి పైగా ఔట్‌లెట్స్ ఉన్న లాట్ మొబైల్స్ ఒక అడుగు ముందుకేసి స్మార్ట్ మ్యాచ్ మేకర్, వర్చువల్ రియాలిటీ అనే అప్లికేషన్లను వినియోగిస్తోంది.
 
 భారీ విస్తరణ దిశగా..
 సెల్‌ఫోన్ల విక్రయ రంగంలో అపార అవకాశాలున్నాయి కాబట్టే తయారీ కంపెనీలు, రిటైల్ సంస్థలు భారీగా విస్తరిస్తున్నాయి. నోకియా, శాంసంగ్, సోనీ, మైక్రోమ్యాక్స్, స్పైస్ వంటి కంపెనీలు అన్ని పట్టణాల్లో స్టోర్లను పెంచుతూ పోతున్నాయి. నోకియాకు 500 పైగా ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు, 2 లక్షలకుపైగా టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇక సెల్‌కాన్ సైతం ఫ్రాంచైజీ విధానంలో ఔట్‌లెట్లను నెలకొల్పే ప్రయత్నాల్లో ఉంది. 125కుపైగా స్టోర్లున్న బిగ్ సి నెలకు ఒక లక్షకు పైచిలుకు ఫోన్లను విక్రయిస్తోంది. 2015 డిసెంబరుకల్లా మరో 300 స్టోర్లు ఏర్పాటు చేయాలని లాట్ మొబైల్స్ కృతనిశ్చయంతో ఉంది. 70 లక్షల మంది కస్టమర్లు తమకు ఉన్నారని, నెలకు 70 వేల మంది కొత్తగా వచ్చి చేరుతున్నారని సంగీత మొబైల్స్ అంటోంది. రూ.500 కోట్లకుపైగా టర్నోవర్ కలిగిన ఈ సంస్థకు ఏడు రాష్ట్రాల్లో 250 ఔట్‌లెట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement