యాపిల్ కలలు పండనున్నాయా..?
న్యూఢిల్లీ : భారత మార్కెట్ పై యాపిల్ పెట్టుకున్న ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి. సొంత రిటైల్ స్టోర్లను భారత్ లో ఏర్పాటు చేసుకోవడానికి స్థానిక నిబంధనల నుంచి రెండు, మూడేళ్ల పాటు యాపిల్ కు కేంద్రప్రభుత్వం ఉపశమనం ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రారంభంలో ఎలాంటి స్థానిక నిబంధనలు అవసరం లేకుండా రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కు, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ)కి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
యాపిల్ కు ఇటీవలే భారత్ లో రిటైల్ స్టోర్లు ఏర్పాటుచేసుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి అనుమతులు లభించాయి. ఎఫ్ డీఐ నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రీటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి కల్పించింది. కానీ మూడింట ఒక వంతు కాంపోనెంట్స్ భారత్ కు చెందినవే ఉండాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ఆర్థిక శాఖ చెప్పింది. స్థానిక ఉద్యోగవకాశాలను, పరిశ్రమను అభివృద్ధి చేయడమే ఈ నిబంధ ఉద్దేశమని స్పష్టం చేసింది. అయితే యాపిల్ కు స్థానిక నిబంధనల నుంచి ఉపశమనం ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తుందని గతవారమే వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.
ఆర్థిక శాఖ ససేమిరా అంటున్నా.. యాపిల్ కు స్థానిక నిబంధనల నుంచి కొంత కాలం ఉపశమనం కలుగనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్నేళ్లపాటు యాపిల్ కు ఈ నిబంధనల నుంచి ఉపశమనం ఇవ్వడం వల్ల కంపెనీ తన అవసరాలను మాత్రమే పూరించుకోగలదని, స్థానిక వర్తకులపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంటున్నాయి. ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్టు తెలుపుతున్నాయి.