ప్రతి బాటిల్‌కు బిల్లు తప్పనిసరి | telagana government announced that new policy for retail outlets | Sakshi
Sakshi News home page

ప్రతి బాటిల్‌కు బిల్లు తప్పనిసరి

Published Sun, Jun 15 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

ప్రతి బాటిల్‌కు బిల్లు తప్పనిసరి

ప్రతి బాటిల్‌కు బిల్లు తప్పనిసరి

తెలంగాణకు నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. తొలుత మద్యం రిటైల్ ఔట్‌లెట్స్ (వైన్‌షాపులు)కు సంబంధించిన పాలసీని ప్రకటించింది.
డ్రా పద్ధతి ద్వారానే కొత్త రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపుల కేటాయింపు జరగనుంది. ఇక రిటైలర్ అమ్మే ప్రతి మద్యం సీసాకు
కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి.    
మద్యం సీసాపై హోలోగ్రామ్‌తోపాటు2డీ బార్‌కోడ్‌ల ముద్రణ
ఎంఆర్‌పీ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు
ప్రతి వైన్‌షాపులో కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దులకు నిర్ణయం
పాత విధానం తరహాలో డ్రా పద్ధతి ద్వారానే వైన్‌షాపుల కేటాయింపు
 గ్రేటర్‌లో రూ.1.04 కోట్ల నుంచి  రూ.90 లక్షలకు తగ్గిన లెసైన్సు ఫీజు
 వరంగల్, కరీంనగర్‌లలో మాత్రం రూ.4 లక్షల పెంపు
 త్వరలో బార్లు, కల్లు దుకాణాలపై విధాన ప్రకటన
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఎక్సైజ్ సంవత్సరం జూన్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో తొలుత మద్యం రిటైల్ ఔట్‌లెట్స్ (వైన్‌షాపులు)కు సంబంధించిన పాలసీని ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్ణయించిన డ్రా పద్ధతి ద్వారానే కొత్త రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపుల కేటాయింపు జరగనుంది. గ్రామాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వరకు జనాభా ఆధారంగా ఆరు స్లాబ్‌ల ద్వారా లెసైన్స్ ఫీజును నిర్ణయించి, మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లెసైన్స్ ఫీజును రూ.1.04 కోట్ల నుంచి రూ.90 లక్షలకు తగ్గించింది. కరీంనగర్, వరంగల్ నగరాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న ఫీజు కన్నా అదనంగా రూ.4 లక్షలకు పెంచింది. అలాగే లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లకు పైగా అమ్మకాలు సాగితే ప్రస్తుతం వసూలు చేస్తున్న 14.01 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 13.6 శాతానికి తగ్గించింది. కొత్తగా మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా రిటైలర్ అమ్మే ప్రతి మద్యం సీసాకు కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి చేశారు. ప్రతి వైన్‌షాపులో కంప్యూటర్, స్కానర్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా జీవో (ఎంఎస్ నెంబర్ 2)ను విడుదల చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
 
 రూ.10,500 కోట్ల ఆదాయం!
 
 కొత్త మద్యం విధానం ద్వారా రాష్ట్రంలో రూ.10,500 కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు తెలంగాణలో రూ.9,481 కోట్ల ఆదాయం రాగా, ఆ మొత్తం సాధారణంగా పది శాతం పెరుగుతుంది. తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన మద్యం విధానంలోని లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ట్యాక్స్ కారణంగా 292 షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రెంటల్స్ రూపంలో రావాల్సిన రూ.1,080 కోట్లకు గాను రూ.931 కోట్లు మాత్రమే ఎక్సైజ్ శాఖకు వచ్చింది. ఈ లెక్కన రూ.250 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ వార్షికాదాయాన్ని కోల్పోయింది.
 
 గ్రేటర్ హైదరాబాద్‌లో తగ్గిన లెసైన్ ్స ఫీజు
 
 దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధానాన్నే కొనసాగిస్తూ నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే రిటైల్ ఔట్‌లెట్ల విషయంలో మద్యం వ్యాపారులకు కొంత ఉపశమనాన్ని కల్పించింది. గ్రేటర్ పరిధిలోని 503 మద్యం దుకాణాలకుగాను ఎక్కడ షాపు ఏర్పాటు చేయాలన్నా.. లెసైన్సు ఫీజును రూ.1.04 కోట్లుగా నిర్ణయించారు. దీంతో 175 ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం తాజాగా గ్రేటర్‌లో లెసైన్స్ ఫీజును రూ.90 లక్షలకు తగ్గించింది. అయితే కరీంనగర్ నగరంలోని 22 దుకాణాలకు సంబంధించి ఇప్పటి వరకున్న రూ.46 లక్షల లెసైన్స్ ఫీజును రూ.50 లక్షలకు, వరంగల్ నగరంలోని 37 దుకాణాలకు ప్రస్తుతం ఉన్న రూ.64 లక్షల ఫీజును రూ.68 లక్షలకు పెంచారు.
 
 ప్రివిలేజ్ ట్యాక్స్‌లో కొంత ఊరట
 
 2012లో రూపొందించిన ఎక్సైజ్ విధానం ప్రకారం.. లెసైన్స్ ఫీజుకు 6 రెట్ల కన్నా అధికంగా జరిగిన మద్యం అమ్మకాలపై 15.01 శాతం మేర ప్రివిలేజ్ ట్యాక్స్‌గా మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసేలా నిబంధనలున్నాయి. దీనిపై మద్యం వ్యాపారుల నుంచి వ్యతిరేకత రావడంతో స్వల్ప సవరణలు చేశారు. లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్ల కన్నా అధికంగా అమ్మకాలు జరిపితే ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 14.01 శాతంగా మారుస్తూ 2013లో నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కొత్త పాలసీలో దాన్ని కూడా తగ్గించి 13.06 శాతంగా నిర్ణయించారు. తద్వారా గతంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ముందుకురాని ప్రాంతాల్లో కూడా దుకాణాలు తెరవవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
 
 బార్ కోడ్లు... ఎప్పటికప్పుడు దాడులు
 
 కొత్త మద్యం విధానంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో మద్యం బాటిళ్లపై బార్‌కోడ్ల ముద్రణ, అమ్మకాలపై బిల్లింగ్ తప్పనిసరి చేయడం. ఈ మేరకు డిస్టిలరీల్లో తయారయ్యే మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్‌కోడ్‌లను ఏర్పాటు చేస్తారు. తద్వారా డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు, అక్కడి నుంచి దుకాణాలకు, కొనుగోలుదారుల వద్దకు వెళ్లే బాటిళ్లకు సంబంధించి ట్రాకింగ్ రికార్డు అవుతుంది. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసే మద్యం వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్, స్కానర్ దుకాణంలో ఏర్పాటు చేసి, అమ్మకం సాగించే ప్రతి బాటిల్‌కు బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రిటైలర్ ఎంఆర్‌పీ రేటు కన్నా అధికంగా మద్యం అమ్మే అవకాశం ఉండదని మంత్రి పద్మారావు, ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ విలేకరులకు తెలిపారు. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వమే తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎంఆర్‌పీ ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కూడా ఇక నుంచి కఠిన చర్యలు ఉంటాయని, తొలిసారి ఉల్లంఘనలు నమోదైతే రూ.20వేల నుంచి లక్ష  రూపాయల వరకు జరిమానా, రెండోసారైతే రూ.2లక్షల జరిమానా విధించి, మూడోసారి పునరావృతమైతే లెసైన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపారు.
 
 కల్లు దుకాణాలపై విధివిధానాలు రూపొందిస్తున్నాం
 
 హైదరాబాద్‌లో 2004లో మూసేసిన కల్లు దుకాణాలు తెరిపించాలని గత కొన్నేళ్లుగా గీత కార్మికులు కోరుతున్నారని, దీనిపై కేసీఆర్ పలుమార్లు హామీ ఇవ్వడంతో పాటు శుక్రవారం అసెంబ్లీలో కూడా స్పష్టత ఇచ్చారని మంత్రి పద్మారావు చెప్పారు. అయితే కల్లు దుకాణాలు ఎప్పుడు పునఃప్రారంభించేది.. ఏ విధానంలో దుకాణాల నిర్వహణ జరపాలన్న విషయంపై విధి విధానాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పారు. ఈ ఎక్సైజ్ పాలసీకి కల్లు దుకాణాలకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వైన్‌షాపులకు సంబంధించిందేనని స్పష్టం చేశారు.  బార్లకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
 
 బెల్ట్‌షాపులు తొలగించాం
 
 తెలంగాణలో ఎన్నికల ముందే 5 వేల బెల్టుషాపులను మూసివేయించడం జరిగిందని, ప్రస్తుతం ఎక్కడైనా ఉన్నా వాటిని కూడా లేకుండా చేస్తామని మంత్రి పద్మారావు, కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా మద్యం వ్యాపారులు అమ్మకాలు సాగించాల్సి ఉంటుందని, ఈ విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement