నేలపై కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం జిల్లాలో 372 మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రతి పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని గొప్పలు చెప్పింది. అయితే పేరు మార్పుతోనే సరిపెట్టి వదిలేయడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
పీలేరు: పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువగా ఉండడంతో జీఓ నెంబర్ 40 ద్వారా మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన వసతులతో కూడిన విద్య అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఈ–లెర్నింగ్, తరగతి గదుల్లో డెస్క్‌ల ఏర్పాటు, ప్రతి పాఠశాలకు ఏడాదికి రూ. లక్ష ప్రత్యేక గ్రాంటు, ఆకర్షనీయమైన తరగతి గదులు, ఇంగ్లిష్ బోధనకు ఉపాధ్యాయుడి నియామకం. ఇది ఆదర్శ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తామన్న సౌకర్యాలు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 372 ప్రాథమిక పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్పు చేశారు.
అంతా అర్భాటమే..
ప్రాథమిక స్థాయిలో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో ఇప్పటి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. విద్యార్థులకు లెక్కలు, ఈవీఎస్(ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్) పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్భాటంగా మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పాఠశాలకు కూడా ప్రత్యేకంగా గ్రాంటు మంజూరు చేసిన దాఖలాలు లేవు. మరోవైపు తరగితి గదుల్లో డెస్కులు లేకపోవడంతో విద్యార్థులు కఠిక నేలపై కూర్చొనే విద్యనభ్యసిస్తున్నారు. ఇక పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఊసే లేదు. మోడల్ స్కూళ్లలో తమకు కార్పొరేట్ తరహా విద్యాబోధన అందుతుందని భావించిన విద్యార్థులకు నిరాశ తప్పడం లేదు. కార్పొరేట్ పోటీని తట్టుకుని నిలబడాలంటే ప్రభుత్వం చెప్పిన మేరకు ప్రతి మోడల్ స్కూల్‌లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవి నిబంధనలు..
♦ తరగతికి ఒక ఉపాధ్యాయుడు
♦ ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలి
♦ కనీసం ఐదు మంది ఉపాధ్యాయులుండాలి
♦ లైబ్రరీ, డిజిటల్ తరగతులు
♦ మౌలిక వసతులు
♦ ఏడాదికి రూ.లక్ష ప్రత్యేక గ్రాంటు
నమ్మకం సన్నగిల్లుతోంది
ఆదర్శ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అంతంత మాత్రమే. పాఠ్యపుస్తకాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. దీని కారణంగా తల్లిదండ్రుల్లో ఆదర్శ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లుతోంది.–గంటా మోహన్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, చిత్తూరు
లక్ష్యం గొప్పదైనా ఆచరణలో విఫలం
విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య అందించాలన్న లక్ష్యం గొప్పదైనా ఆ మేరకు వసతులు కల్పించకుంటే ఎలా? చాలా పాఠశాలల్లో ఆటస్థలం, లైబ్రరీ, డిజిటల్ తరగతులు లేవు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అరకొరగా వస్తున్నాయి. దీనికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.–జి. రాధాకృష్ణ,యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు
జీఓ ప్రకారం వసతులు కల్పించాలి
మోడల్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో తరగతి గదులు, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేయాలి. –మోడెం చెంగల్‌రాయుడు,హెచ్‌ఎం, మోడల్‌స్కూల్, పీలేరు
Comments
Please login to add a commentAdd a comment