
రోడ్డెక్కిన మోడల్ స్కూల్ విద్యార్థులు
కలిగిరి: కలిగిరి సమీపంలోని కమ్మ వారిపాళెంలో మోడల్ స్కూల్ వద్ద నెల్లూరు-పామూరు వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులను ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారం పాఠశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై 2 గంటలపాటు రాస్తారోకో నిర్వహించా రు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ బస్సు సౌకర్యం ఉన్న మార్గంలో కూడా ఆర్టీసీ బస్సులను నిలపడం లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆటోలను బాడుగకు మాట్లాడుకుని పాఠశాలకు వస్తున్నామన్నారు. గురువారం ఆటో బోల్తాపడి సహచర విద్యార్థులు ఐదుగురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు సక్రమంగా నిలిపి ఉంటే వారికి ఆ దుస్థితికి కలిగేది కాదన్నారు. బస్‌లో విధులు నిర్వహించే కండక్టర్ సుధాకర్ తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని నాగిరెడ్డిపాళేనికి చెందిన పలువురు విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్సు పాసులు లాక్కుంటున్నాడని, అసలు మిమ్మల్ని బస్సులో ఎవరూ ఎక్కమన్నారంటూ దుర్భాషలాడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్ ప్రవర్తనకు నిరసగా ప్లకార్డులు ప్రదర్శించారు. పాఠశాలల వేళల్లో బస్సులు ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు రాస్తారోకోకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు డిపో మేనేజర్ సుబ్రమణ్యం ఫోన్‌లో మాట్లాడుతూ కలిగిరి మోడల్ స్కూల్ వద్ద సమస్య ఇంతవరకు తమ దృష్టికి రాలేదన్నారు. సంగం - కలిగిరి మార్గంలో ఎక్కడ చెయ్యి ఎత్తినా బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటామన్నారు.