=పాత కార్డులపై యూనిట్లు తగ్గించకుండా జారీ
= రేషన్ డీలర్లకు మిగిలిపోతున్న బియ్యం
యలమంచిలి, న్యూస్‌లైన్ : పాత రేషన్ కార్డుల్లో యూనిట్లను తగ్గించకుండా కొత్త కార్డులను పంపిణీ చేయడంతో డీలర్ల పంట పండింది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్క యూనిట్‌పై 4 కేజీల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 10,83,475 రేషన్ కార్డులుండగా గత నెలలో జరిగిన రచ్చబండలో 1,36,856 కార్డులను పంపిణీ చేశారు.
రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెలా 17 వేల టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. వాస్తవానికి ఏదైనా కుటుంబంలో పెళ్లయిన వ్యక్తికి కొత్త రేషన్ కార్డు జారీ చేయాలంటే ఆ ఇంటి పాత రేషన్ కార్డులో యూనిట్లను తగ్గించవలసి ఉంది. ఆ మేరకు పంపిణీ చేయాల్సిన బియ్యం కోటా తగ్గుతుంది. కానీ పాత కార్డుల్లో యూనిట్లను తగ్గించకుండా కొత్త కార్డుల్ని జారీ చేసేందుకు డీలర్లే రెవెన్యూ యంత్రాంగానికి మామూళ్లు ఎర వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రచ్చబండ రేషన్ కార్డుల పంపిణీతో పాత కార్డుల్లో యూనిట్లను తగ్గించినట్టు వినియోగదారులను నమ్మిస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క డీలరుకు 2 నుంచి 3 క్వింటాళ్ల రాయితీ బియ్యం మిగులుతుందని అంచనా.
యూనిట్ల తగ్గింపు సాధ్యమే
పాత రేషన్ కార్డుల్లో యూనిట్ల తగ్గింపు సాధ్యమైనా రెవెన్యూ యంత్రాంగానికి రేషన్ డీలర్లకు ఉన్న అనుబంధంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కీ రిజిస్టర్ ఆధారంగానైనా పాత రేషన్ కార్డుల్లో యూనిట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ విధానాన్ని పలు రేషన్ దుకాణాల్లో మొక్కుబడిగా పూర్తి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డులతో కాసుల వర్షం
Published Wed, Dec 25 2013 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement