సాక్షి, గుంటూరు : ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న విద్యాబోధనలో ప్రభుత్వం కాలానుగుణమైన మార్పులను ప్రవేశపెడుతోంది. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రూపొందించిన పర్సనలైజ్డ్ అడాప్షన్ లెర్నింగ్ (పాల్) ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు పర్చేందుకు నిర్ణయించింది. ఈ పథకం అమలుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. గుంటూరు జిల్లాలోని 20 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పాల్ ప్రాజెక్టులో భాగంగా ఆధునిక విద్యాబోధన అందించేందుకు ట్యాబ్‌లను అందజేసింది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు సకల సదుపాయాలతో ఆధునిక విద్య అందించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఆర్థిక పరమైన వనరులను సమకూర్చడంలో రాజీ పడకుండా చర్యలు చేపట్టింది. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు మెళకువలు నేర్పేందుకు ఆరు నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పాల్ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎంపిక చేసింది.
తొలి విడత 20 పాఠశాలల్లో అమలు
జిల్లా వ్యాప్తంగా 296 హైస్కూళ్లలో వర్చువల్ క్లాస్‌రూమ్స్, మరో 410 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వం దీనిని విస్తతం చేస్తూ పాల్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తొలి విడతలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న 20 హైస్కూళ్లను ఎంపిక చేసింది. ఇందుకు గానూ ట్యాబ్‌ల ద్వారా సబ్జెక్టుల వారీగా నిపుణులతో విద్యాబోధన చేస్తారు. ట్యాబ్‌ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా నుంచి సీనియర్ సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేసి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి జాబితా పంపే పనిలో జిల్లా విద్యాశాఖాధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో పాఠశాలకు 30 చొప్పున ట్యాబ్‌లను అందించనుండగా ఇద్దరు, ముగ్గురేసి విద్యార్థులు కలిసి ఒక ట్యాబ్‌ను వినియోగించనున్నారు.
ఉన్నత చదువులకు సమాయత్తమయ్యేలా..
పాఠశాలస్థాయిలోనే ఆధునిక విద్యాబోధన పద్ధతులను అమలు పర్చడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత చదువులకు దోహదం చేసే విధంగా పాల్ ప్రాజెక్టును తీర్చిదిద్దిన ప్రభుత్వం విద్యార్థి కేంద్రంగా అమలుచేయనుంది. పాల్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపిక చేసిన 20 ఉన్నత పాఠశాలల్లో ముందుగా గణితశాస్త్రంలో బోధన చేయనున్నారు. అనంతరం మిగిలిన సబ్జెక్టులను ప్రవేశపెట్టనున్నారు. పాల్ కార్యక్రమాన్ని విడతల వారీగా జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో అమలు పర్చేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
పాల్‌కు ఎంపికైన పాఠశాలలు ఇవే..
వేమవరం, మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీ, పిడుగురాళ్ల మండలంలోని పిన్నెల్లి, బ్రాహ్మణపల్లి, రాజుపాలెంలోని కూబాడ్‌పురం, బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, నకరికల్లు, మాదల, సాతులూరు, చిరుమామిళ్ల, గణపవరం, శంకరభారతీపురం, యల్లమంద, ఉప్పలపాడు, కోటప్పకొండ, రెడ్డిపాలెం, బొగ్గరం, నడిగడ్డ, సీజే పాలెంలోని జెడ్పీ హైస్కూళ్లతో పాటు వినుకొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి.
సక్రమంగా అమలు చేస్తాం
పర్సనలైజ్డ్ ఆడాప్షన్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. పాఠశాలలకు ట్యాబ్‌లను చేర్చి ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడం ద్వారా విద్యార్థి కేంద్రంగా ఆధునిక బోధన అందిస్తాం. పాల్ ప్రాజెక్టు కింద జిల్లాను ఎంపిక చేయడం మంచి పరిణామం.
– ఆర్.ఎస్ గంగాభవాని, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment