ఆధునిక పరిజ్ఞానంపై శిక్షణ అవశ్యం
ఏఎన్‌యూ: ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక పరిజ్ఞానంపై ప్రభుత్వ అధికారులు, సిబ్బంది శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ అన్నారు. ఁఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆప్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్* అనే అంశంపై యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం, హైదరాబాద్‌కు చెందిన ట్రూత్ ల్యాబ్స్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు సభ సాయంత్రం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఐజీ మాట్లాడుతూ నిపుణులకు తెలిసిన శాస్త్రవిషయూలను అందరికీ పంచటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. పలు కీలక అంశాల్లో ఫోరెన్సిక్ విభాగం ద్వారా పోలీసు శాఖ విశేష సేవలు అందిస్తోందని చెప్పారు. బాంబు పేలుళ్లు, మారణ హోమాలు జరిగినపుడు మృతుల శరీర భాగాలు, ఘటనలకు సంబంధించిన ఆధారాలు సేకరించటం, వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు అనుగుణంగా భధ్రపరచటం చాలా కీలకమని పేర్కొన్నారు.
వేలిముద్రల విభాగం, ఇతర కీలక శాఖలు సమన్యయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. నక్సలైట్ల నిర్మూలనలో గ్రే హౌండ్స్ ద ళాలతోపాటు ఫోరెన్సిక్ విభాగం పాత్ర కీలకమని తెలిపారు. ప్రస్తుతం యువత దేశంలో విజ్ఞానాన్ని పెంపొందించుకుని దాని ఫలాలను ఇతర దేశాలకు అందిస్తోందని చెప్పారు. ఇక్కడి జ్ఞాన ఫలాలు ఇక్కడే ఉపయోగపడాలన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుల సేవల వల్లే మనం ఈ విధంగా ఉన్నామన్నారు.
ఏ స్థాయి అధికారైనా తప్పులు సరిదిద్దుకోవటానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతేనే భయపడాలని చెప్పారు. ఆన్‌లైన్ విద్యావిధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్ డాక్టర్ గాంధీ పీసీ కాజా, లా విభాగాధిపతి ఆచార్య ఎల్.జయశ్రీ తదితరులు ప్రసంగించారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి ఐజీ సర్టిఫికెట్లు అందజేశారు.
ఆన్‌లైన్‌లో ఫోరెన్సిక్ సంబంధిత కోర్సులు
ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఎన్‌యూ ఓఎస్‌డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావు మాట్లాడుతూ ఏఎన్‌యూ, ట్రూత్ ల్యాబ్‌ల మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) ఖరారు కానుందని వెల్లడించారు. అనంతరం ట్రూత్‌ల్యాబ్స్ సహకారంతో ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులను నిర్వహించనున్నామని తెలిపారు.