
అబద్దాలు చెప్పడంలో పోటీపడుతున్న మోడీ-బాబు
అనంతపురం: అబద్దాలు చెప్పడంలో దేశ ప్రధాని నరేంద్రమోడి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరికొకరు పోటీపడ్డారని అఖిల పక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన కేంద్ర కార్యాలయాల ముట్టడి సమయంలో పోలీసులు అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆందోళనకారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో గురువారం ఉదయం అఖిల పక్ష నాయకులు టూటౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో గత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందన్నారు. తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ తొమ్మిది నెలలవుతున్నా ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వీటి గురించి మాట్లాడితే దాటవేసే ధోరణి అవలంభిస్తూ దోబూచులాడుతున్నారని ధ్వజవమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ పోరాటాలు చేసిన వైఎస్సార్‌సీపీ పూర్తి మద్ధతు ఇస్తుందని ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి గత ప్రధాని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గతంలో చెప్పిన హామీలపై కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తె చ్చే అంశంలో ముఖ్యమంత్రి తమతో కలిసి రావాలని లేదంటే గతంలో పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు పిలుచుకెళ్లాలని ముఖ్యమంత్రికి సూచించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆందోళన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్రమోడి తన భార్యతో సహజీవనం చేయలేదు కాని ఆయనకూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నారన్నారు. మరోవైపు వీలైనంతమంది పిల్లలను కనాలని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆందోళనకారులను భయబ్రాంతులకు గురి చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్యలు తీసుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు ఎంవీ రమణ, నారాయణస్వామి, జాఫర్, వైఎస్సార్‌సీపీ ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, ధనుంజయయాదవ్, కాంగ్రెస్ నాయకులు జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.