అభివృద్ధే మోదీ ఎజెండా
కేంద్రమంత్రులు వెంకయ్య, మహేష్‌శర్మ, థావర్ చంద్ గెహ్లాట్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మహేష్‌శర్మ, థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. ప్రపంచమంతా మోదీ వైపు చూస్తోందని.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారని వారు వివరించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతినగర్‌లో ఆదివారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీ క్యాప్డ్ రీసోర్స్ సెంటర్‌కు వెంకయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం గొలగమూడిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్‌మెంట్ భవనాన్ని ప్రారంభించారు.
నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య, గెహ్లాట్, మహేష్‌శర్మ మాట్లాడారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందితే దేశం అదనంగా 1.5 నుంచి 2 శాతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్టణంలో 100 ఎకరాల్లో నేషనల్ స్పోర్ట్స్ డిజేబుల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాకినాడ రాజమండ్రి మధ్యలో పెట్రో కెమికల్ ఇండస్ట్రీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏపీలో నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో అణుకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.