మాట్లాడుతున్న మహమ్మద్ ఇక్బాల్, చిత్రంలో రెహమాన్, కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్త, రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఆయన సీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏమీ లేదని, కపట ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన సీమ వాసులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ ప్రాంతానికి రావాలన్నారు. బనగానపల్లె పట్టణంలో బుధవారం 93, 94 బూత్ కన్వీనర్లు అనిల్, అల్లిహుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో పాటు మహమ్మద్ ఇక్బాల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌ఏ రెహమాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆస్థా«నం కూడలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఇక్బాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరిగినా ఆ నెపాన్ని కర్నూలు, కడప ప్రజలపైకి నెట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యాన్ని సైతం ప్రభుత్వంవిస్మరించిందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు. నాడు సోనియాను గాడ్సే, దెయ్యమని విమర్శించిన చంద్రబాబు.. నేడు దేవతలా పేర్కొంటూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం శోచనీయమన్నారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ముస్లిం మైనార్టీలు నమ్మొద్దన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడని, ఆయన్ను సీఎం చూడాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే బీసీని మట్టి కరిపించాలి: బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. అణుకువ, సేవాభావం కల్గిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని ఆదరించాలని ప్రజలకు సూచించారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి శ్రేయస్సు కోసం తపన పడే కాటసాని రామిరెడ్డి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు.
హిందూ, ముస్లింలు రెండు కళ్లు : రెహమాన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రంలోని హిందూ, ముస్లింలు రెండు కళ్లు అని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎంగానూ, కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగానూ కావడం తథ్యమన్నారు. రాష్ట్ర ప్రజలు వరుస తుపానులతో తల్లడిల్లుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తి కట్టి రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టి కేవలం రెండు సీట్లు సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీతోనే సరిపుచ్చుకోవడం దారుణమన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గుండం శేషిరెడ్డి, మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా నాయకులు అబ్దుల్‌ఖైర్, అబ్దుల్‌ఫైజ్, ఎంఐఎం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అమ్మబా, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment