
చంద్రగిరి: శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుందని విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్‌బాబు మాట్లాడుతూ 2017–18, 18–19 విద్యాసంవత్సరంలో ఫీజు రియింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.20 కోట్లను ప్రభుత్వం తమకు చెల్లించాల్సి ఉందన్నారు. రెండు విద్యాసంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు బకాయిలను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.
తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టడంతో పాటు.. బ్యాంకుల్లో రుణాలను తీసుకుని కళాశాలను నడిస్తున్నామని తెలిపారు. ఒక నెలకు కళాశాల నిర్వహణకు సుమారు రూ.6కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోందని, ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోయినా సిబ్బందికి వేతనాలను సకాలంలోనే చెల్లిస్తున్నామని చెప్పారు. సుమారు 26 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యనందించడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు లోబడి విద్యాసంస్థల్లోని విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నానని మోహన్‌బాబు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment