Sri Vidyanikethan
-
అనంతపురం: శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి(56) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవరకొండలో కరస్పాండెంట్ ఉమాపతి, సహా కారు డ్రైవర్ కొండపైకి వెళ్లారు. అనంతరం, డ్రైవర్‌ను దింపిసి కరస్పాండెంట్ ఉమాపతి.. స్పీడ్‌గా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కొండపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ సార్.. సార్ అంటూ అరుస్తున్న ఉమాపతి పట్టించుకోలేదు. అయితే, ఉమాపతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
మనోజ్- మౌనిక దంపతులకు గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్
మంచు మనోజ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మోహన్‌బాబు తనయుడిగా నటనను అందిపుచ్చుకున్న మనోజ్ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ చేరుకున్నారు మనోజ్. పెళ్లి అయ్యాక తొలిసారి జంటగా వెళ్లిన మనోజ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్యార్థులంతా ఒక్కసారిగా నూతన దంపతులకు ఆహ్వానం పలికారు. తాజాగా ఈ వీడియోను మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కారులో శ్రీ విద్యానికేతన్ చేరుకున్న మనోజ్, మౌనికలకు వేలమంది విద్యార్థులు వరుసలో నిలబడి ఘనస్వాగతం పలికారు. విద్యాసంస్థలోకి మనోజ్ అడుగు పెట్టగానే విద్యార్థుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాకుండా ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు నూతన వధువరులు. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ నెక్ట్స్ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆదివారం మార్చి 19న తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మోహన్ బాబు బర్త్‌డే వేడుకలను శ్రీ విద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ఫీజులో రాయితీ.. సినీ కార్మికుల పిల్లలకు ఆఫర్: మోహన్ బాబు
Mohan Babu announces An Educational Offer: ‘తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందిన పిల్లలకు ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’లో ఫీజుల్లో రాయితీ ఇవ్వనున్నాం’ అని నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘47 ఏళ్లుగా సినీ కళామతల్లి నన్ను నటుడిగా, నిర్మాతగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుంది. 30 ఏళ్లుగా ‘శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్’కి అధినేతగా ఉన్నాను. 1992లో ఈ విద్యాలయాల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొంతమంది పిల్లలకు, సినిమా ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది పిల్లలకు 25శాతం మందికి కులమతాలకు అతీతంగా ఉచితంగా విద్య అందిస్తున్నాం. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలన్నీ ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’ (యమ్‌బి యూనివర్శిటీ) గా మారింది. నాకెంతో ఇచ్చిన తెలుగు పరిశ్రమకు ఏదైనా ఉడతా భక్తిగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందినవారి పిల్లలు మా ‘యమ్‌బీయు’లో చదవాలనుకుంటే ఫీజులో రాయితీ ఇస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అన్నారు. -
బ్రహ్మాండంగా నటిస్తున్న చంద్రబాబు
చంద్రగిరి: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఆయన శ్రీవిద్యానికేతన్ సంస్థల ఎదుట శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. ఒక దశలో ఆయన నిరసనను అడ్డుకొని, గృహ నిర్బంధం చేయడానికి పోలీసులు యత్నించారు. ఆయన మాత్రం నిరసన దీక్షను చేసి తీరుతానంటూ ముందుకు సాగారు. అసలేం జరిగిందంటే... 2014 నుంచి 2019 విద్యాసంవత్సరం వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకే సుమారు రూ.19.24 కోట్లు బకాయి పడ్డారు. గతంలో అన్ని సామాజిక వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేవారు. అయితే ఇటీవల ఒక సామాజికవర్గానికి మాత్రం ప్రత్యేకంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రటిం చింది. ఈ క్రమంలో ఆ ఒక్క సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు 2018–19 విద్యా సంవత్సరంలో రూ.2.16కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉంచారు. దీనిపై 20 రోజుల క్రితం మోహన్ బాబు సీఎం చంద్రబాబుకు స్వయంగా ఉత్తరాలు రాశారు. అయినా స్పందించలేదు. దీంతో ఆయన శుక్రవారం పదివేల మంది విద్యార్థులతో కలసి నిరసనకు దిగారు. మోహన్‌బాబు మాట్లాడుతూ మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి శ్రీవిద్యానికేతన్‌కు సుమారు రూ.19కోట్ల మేర బకాయిలు రావాలన్నారు. ఎన్నిసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుం డా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానని స్పష్టం చేశారు. పగలు, రాత్రి, అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తాయో అలాగే కాలం ఎల్లవేళలా మనది కాదని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో అని హితవు పలికారు. బ్రహ్మాండంగా నటిస్తున్న చంద్రబాబు సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారని, అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, చివరకు ఆయన అందర్నీ మోసం చేశారని మండిపడ్డారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు నాయుడు ఇంకా యువతకు ఏం ఉద్యోగాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అలాగే మహానుభావుడు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని, మంచిచేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తామన్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి జనం ఓటు వేస్తే నీచంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు మాట్లాడే చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే మంచి గుణపాఠం చెబుతారన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు పసుపు–కుంకుమ గుర్తుకు వచ్చిందా.. అని ప్రశ్నించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మోహన్‌బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
బకాయిలపై సీఎంకు చాలాసార్లు లేఖలు రాశాను
-
చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకో: మోహన్ బాబు
సాక్షి, తిరుపతి : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని సీనియర్ నటుడు, శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు. అప్పట్లో కోట్లాదిమంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. సీఎం చంద్రబాబు అంటే నాకు ఇష్టం. అయినా మాకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. చంద్రబాబు అనేకసార్లు మా కాలేజీకి వచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ 2014 నుంచి 2018 వరకూ రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. చదవండి...(ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజీని నడపాల్సి వస్తుంది!) నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. బకాయిలపై సీఎంకు చాలాసార్లు లేఖలు రాశాను. 2017-2018 సంవత్సరంలో కొత్త నిబంధనలు పెట్టారు. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలి. చంద్రబాబు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా?. నాకు ఏ కులం లేదు, నేను అందరివాడిని. నాణ్యత లేని విద్యను నేను ఇవ్వను. మా విద్యాసంస్థలలో ర్యాగింగ్ ఉండదు. నేను రాజకీయం కోసం మాట్లాడలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే మరింత ఆందోళనకు సిద్ధం.’ అని మోహన్ బాబు స్పష్టం చేశారు. -
ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజీని నడపాల్సి వస్తుంది!
చంద్రగిరి: శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుందని విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్‌బాబు మాట్లాడుతూ 2017–18, 18–19 విద్యాసంవత్సరంలో ఫీజు రియింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.20 కోట్లను ప్రభుత్వం తమకు చెల్లించాల్సి ఉందన్నారు. రెండు విద్యాసంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు బకాయిలను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టడంతో పాటు.. బ్యాంకుల్లో రుణాలను తీసుకుని కళాశాలను నడిస్తున్నామని తెలిపారు. ఒక నెలకు కళాశాల నిర్వహణకు సుమారు రూ.6కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోందని, ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోయినా సిబ్బందికి వేతనాలను సకాలంలోనే చెల్లిస్తున్నామని చెప్పారు. సుమారు 26 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యనందించడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు లోబడి విద్యాసంస్థల్లోని విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నానని మోహన్‌బాబు తెలియజేశారు. -
మోహన్‌బాబు తల్లి లక్ష్మమ్మ కన్నుమూత
-
మోహన్‌బాబు ఇంట్లో విషాదం
సాక్షి, చిత్తూరు: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) గురువారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆమె భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు తరలించారు. మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. లక్ష్మమ్మ మరణవార్త తెలియగానే వారు హుటాహుటిన స్వదేశానికి బయలుదేరారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి. ఆమె అంత్యక్రియలకు రాజకీయ, సీని ప్రముఖులు హాజరుకానున్నారు. -
అవమాన భారం.. తీసింది ప్రాణం
► శ్రీ విద్యానికేతన్‌లో కడప విద్యార్థి ఆత్యహత్య లింగాల: చదువులో వెనుకబడిన విద్యార్థులను అధ్యాపకులు చేరదీసి విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దాలి.. కానీ అలా చేయకుండా ప్రతిసారి అవమానకరంగా మాట్లాడడం, చీదరించుకోవడం, చులకనగా చూడడం ఆ విద్యార్థిని కలచివేసింది. ఎందుకీ బతుకు అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకున్నాడు. లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన కాకర్ల అమరనాథరెడ్డి(20) ఆత్మహత్య చేసుకుని కన్నవారికి క్షోభను మిగిల్చి వెళ్లిపోయాడు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో అమరనాథరెడ్డి బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ద్వితీయ సంవత్సరం మార్కులను అధ్యాపకులు సరిగా తెలపకపోవడం, అవమానకరంగా మాట్లాడడం తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో విద్యార్థి పేర్కొన్నాడు. శనివారం రాత్రి అమరనాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కశాశాల వారు చేరవేశారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు తిరుపతికి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. చదువులో వెనుకబాటుతనం, అధ్యాపకుల వేధింపులే కారణమని సూసైడ్‌నోట్‌లో విద్యార్థి వివరించాడు. తండ్రి లేని లోటు, మానసిక ఒత్తిడి.. ఆత్మహత్యకు కారణాలయ్యాయి. విద్యార్థి తండ్రి మోహన్‌రెడ్డి 8 ఏళ్ల కిందట ధనుర్వాతంతో మృతి చెందాడు. అమరనాథరెడ్డికి తల్లి, చెల్లెలు ఉన్నారు. -
శ్రీ విద్యానికేతన్ అందరికీ ఆదర్శం
మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో కేంద్ర మాజీ హోంమంత్రి షిండే చంద్రగిరి: శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షి కోత్సవం ప్రముఖ సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ దేశంలో విద్యావ్యవస్థ పటిష్టం కావాల్సిన అవ సరం ఉందన్నారు. మోహన్‌బాబు విద్యావ్యవస్థను గౌరవించి 25 శాతం పేదలకు ఉచితంగా విద్యను అందించడం ప్రశంసనీయమని అన్నారు. క్రమశిక్షణతో పాటు విద్యార్థుల ఉన్నతికి పునాది వేస్తున్న ఏకైక సంస్థ శ్రీవిద్యానికేతన్ అని తెలిపారు. -
తెలుగు సినీపరిశ్రమలో ప్రోత్సాహం బాగుంది
యువనటి ప్రియాంక తిరుమల : తెలుగు సినీపరిశ్రమలో తనకు మంచి పోత్సాహం లభిస్తోందని మదనపల్లెకు చెందిన యువ సినీనటి ప్రియాంక తెలిపారు. ఆదివారం శ్రీవారి దర్శనార్థ ఆమె తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక అతిథిగృహం వద్ద ‘సాక్షి’తో మాట్లాడారు. మోహన్‌బాబు శ్రీవిద్యానికేతన్ కళాశాలలో చదివానని, అక్కడ జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ ద్వారా తనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలుగులో తాను నటించిన ‘ప్రేమలేదు’ చిత్రానికి మంచి ఆదరణ వచ్చిందని, ప్రస్తుతం ‘జయహో’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. కన్నడ, తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవటం తనకు ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించటమే తన లక్ష్యమన్నారు.