చంద్రగిరి: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఆయన శ్రీవిద్యానికేతన్ సంస్థల ఎదుట శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. ఒక దశలో ఆయన నిరసనను అడ్డుకొని, గృహ నిర్బంధం చేయడానికి పోలీసులు యత్నించారు. ఆయన మాత్రం నిరసన దీక్షను చేసి తీరుతానంటూ ముందుకు సాగారు.
అసలేం జరిగిందంటే...
2014 నుంచి 2019 విద్యాసంవత్సరం వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకే సుమారు రూ.19.24 కోట్లు బకాయి పడ్డారు. గతంలో అన్ని సామాజిక వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేవారు. అయితే ఇటీవల ఒక సామాజికవర్గానికి మాత్రం ప్రత్యేకంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రటిం చింది. ఈ క్రమంలో ఆ ఒక్క సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు 2018–19 విద్యా సంవత్సరంలో రూ.2.16కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉంచారు. దీనిపై 20 రోజుల క్రితం మోహన్ బాబు సీఎం చంద్రబాబుకు స్వయంగా ఉత్తరాలు రాశారు. అయినా స్పందించలేదు. దీంతో ఆయన శుక్రవారం పదివేల మంది విద్యార్థులతో కలసి నిరసనకు దిగారు. మోహన్‌బాబు మాట్లాడుతూ మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి శ్రీవిద్యానికేతన్‌కు సుమారు రూ.19కోట్ల మేర బకాయిలు రావాలన్నారు. ఎన్నిసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుం డా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానని స్పష్టం చేశారు. పగలు, రాత్రి, అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తాయో అలాగే కాలం ఎల్లవేళలా మనది కాదని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో అని హితవు పలికారు.
బ్రహ్మాండంగా నటిస్తున్న చంద్రబాబు
సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారని, అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, చివరకు ఆయన అందర్నీ మోసం చేశారని మండిపడ్డారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు నాయుడు ఇంకా యువతకు ఏం ఉద్యోగాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అలాగే మహానుభావుడు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని, మంచిచేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తామన్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి జనం ఓటు వేస్తే నీచంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు మాట్లాడే చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే మంచి గుణపాఠం చెబుతారన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు పసుపు–కుంకుమ గుర్తుకు వచ్చిందా.. అని ప్రశ్నించారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మోహన్‌బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment