అవమాన భారం.. తీసింది ప్రాణం
► శ్రీ విద్యానికేతన్‌లో కడప విద్యార్థి ఆత్యహత్య
లింగాల: చదువులో వెనుకబడిన విద్యార్థులను అధ్యాపకులు చేరదీసి విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దాలి.. కానీ అలా చేయకుండా ప్రతిసారి అవమానకరంగా మాట్లాడడం, చీదరించుకోవడం, చులకనగా చూడడం ఆ విద్యార్థిని కలచివేసింది. ఎందుకీ బతుకు అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకున్నాడు. లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన కాకర్ల అమరనాథరెడ్డి(20) ఆత్మహత్య చేసుకుని కన్నవారికి క్షోభను మిగిల్చి వెళ్లిపోయాడు.
తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో అమరనాథరెడ్డి బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ద్వితీయ సంవత్సరం మార్కులను అధ్యాపకులు సరిగా తెలపకపోవడం, అవమానకరంగా మాట్లాడడం తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో విద్యార్థి పేర్కొన్నాడు. శనివారం రాత్రి అమరనాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కశాశాల వారు చేరవేశారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు తిరుపతికి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. చదువులో వెనుకబాటుతనం, అధ్యాపకుల వేధింపులే కారణమని సూసైడ్‌నోట్‌లో విద్యార్థి వివరించాడు. తండ్రి లేని లోటు, మానసిక ఒత్తిడి.. ఆత్మహత్యకు కారణాలయ్యాయి. విద్యార్థి తండ్రి మోహన్‌రెడ్డి 8 ఏళ్ల కిందట ధనుర్వాతంతో మృతి చెందాడు. అమరనాథరెడ్డికి తల్లి, చెల్లెలు ఉన్నారు.