amaranath reddy
-
అవమాన భారం.. తీసింది ప్రాణం
► శ్రీ విద్యానికేతన్‌లో కడప విద్యార్థి ఆత్యహత్య లింగాల: చదువులో వెనుకబడిన విద్యార్థులను అధ్యాపకులు చేరదీసి విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దాలి.. కానీ అలా చేయకుండా ప్రతిసారి అవమానకరంగా మాట్లాడడం, చీదరించుకోవడం, చులకనగా చూడడం ఆ విద్యార్థిని కలచివేసింది. ఎందుకీ బతుకు అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకున్నాడు. లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన కాకర్ల అమరనాథరెడ్డి(20) ఆత్మహత్య చేసుకుని కన్నవారికి క్షోభను మిగిల్చి వెళ్లిపోయాడు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో అమరనాథరెడ్డి బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ద్వితీయ సంవత్సరం మార్కులను అధ్యాపకులు సరిగా తెలపకపోవడం, అవమానకరంగా మాట్లాడడం తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో విద్యార్థి పేర్కొన్నాడు. శనివారం రాత్రి అమరనాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కశాశాల వారు చేరవేశారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు తిరుపతికి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని ఆదివారం తీసుకువచ్చారు. చదువులో వెనుకబాటుతనం, అధ్యాపకుల వేధింపులే కారణమని సూసైడ్‌నోట్‌లో విద్యార్థి వివరించాడు. తండ్రి లేని లోటు, మానసిక ఒత్తిడి.. ఆత్మహత్యకు కారణాలయ్యాయి. విద్యార్థి తండ్రి మోహన్‌రెడ్డి 8 ఏళ్ల కిందట ధనుర్వాతంతో మృతి చెందాడు. అమరనాథరెడ్డికి తల్లి, చెల్లెలు ఉన్నారు. -
పేదల నోరు కొట్టడమే ప్రభుత్వ లక్ష్యం
పలమనేరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చి నాలుగు నెలలవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, పేదల నోరు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్న పథకాలను ఊడగొట్టేందుకు ఈ ప్రభుత్వం కమిటీలు, విచారణల పేరిట నాటకమాడుతోందన్నారు. ఇప్పటికే పాలన అస్తవ్యస్తమైందని, కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితమయ్యారని అన్నారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఉన్న వాటిని తొల గించేందుకు విచారణ పేరిట కొత్త డ్రామాను తెరమీదికి తెచ్చిందని దుయ్యబట్టారు. మొత్తం మీద ఏ కార్యక్రమం చేసినా ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే మేలు జరిగేలా పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల ద్వారా గెలుపొందిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అధికార పార్టీ వారితో జన్మభూమి కోసం కమిటీలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా బాండ్లను ఇస్తే వాటిని నేలకేసి రాసుకోవాలా అని మండిపడ్డారు. ఆ బాండ్లు మెచ్యూర్డ్ అయ్యాక డబ్బు తీసుకోవచ్చని, అంతవరకు తీసుకున్న రుణాలు కట్టాల్సిం దేనని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓ వైపు రైతులు, మరో వైపు పింఛన్‌దారులు, ఇంకో వైపు డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో రగిలిపోతుంటే ఏ మొహం పెట్టుకొని జన్మభూమి కోసం గ్రామాల్లోకెళ్తారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకొచ్చాక రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో కార్పొరేటర్ల పెత్తనం సాగిందని ఆరోపించారు. మొత్తం మీద ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చాంద్‌బాషా, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
విద్యార్థుల పోరుకేక.. కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 84వరోజూ మంగళవారం ఉధృతంగా సాగింది. రాష్ర్టం ముక్కలైతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందంటూ విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీలో జరిగిన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థుల సదస్సు ఎంపీలు రాజీనామాలు చేసేవరకు ఉద్యమించాలని తీర్మానించింది. కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించిన విద్యార్థి గర్జన జరిగింది. రాష్ట్రం విడిపోతే ఉపాధి అవకాశాలు మృగ్యమై విద్యారంగం తిరోగమనం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. కర్నూలు లో భూగర్భ జలశాఖ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపుమేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రహోంమంత్రి షిండేకు మెసెజ్‌ల ద్వారా సమాచారం పంపించారు. ముదినేపల్లి మండలం చిగురుకోటలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు గడపగడపకు మేల్కొలుపు పేరుతో ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేటలో విద్యార్థులు పిరమిడ్ల ఆకారంతో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కలిదిండి సెంటరులో రైతులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో కదంతొక్కుతున్న పార్టీ శ్రేణలు మంగళవారం కూడా విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శిబిరం వదే ్ద రోడ్డు పక్కన చెప్పులు కుట్టి, బూట్ పాలిష్ చేసి, రోడ్లు శుభ్రం చేసి నిరసన తెలిపారు. తిరుపతిలో తుడా మైదానం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూటలుమోసి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఇలా మూటలు మోసుకొని వచ్చే ఆదాయంతో జీవించాల్సిందేనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ శ్రీకాళహస్తిలో పార్టీ నేత బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు కల్యాణి ఆధ్వర్యంలో వృత్తి పనివారు, రైతులు, రజకులు, చేనేత కార్మికులు పనిముట్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెంలో పార్టీ కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే ధర్నా చేపట్టారు. ఇక ఈనెల 2వతేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
అమరనాథ్‌రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం
వైఎస్సార్‌జిల్లా: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అమరనాథ్‌రెడ్డికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా రాజంపేటఆస్పత్రికి తరలించారు. ఆయనకు షుగర్ లెవిల్స్ భారీగా పడిపోయి, బీపీ పెరిగిపోవడంతో దీక్షను భగ్నం చేశారు. కాగా, ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తానని అమర్నాథ్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కడపలో ఆమర్నాథ్ రెడ్డి దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని కారణంటూ ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు.