పేదల నోరు కొట్టడమే ప్రభుత్వ లక్ష్యం
పలమనేరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చి నాలుగు నెలలవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, పేదల నోరు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్న పథకాలను ఊడగొట్టేందుకు ఈ ప్రభుత్వం కమిటీలు, విచారణల పేరిట నాటకమాడుతోందన్నారు. ఇప్పటికే పాలన అస్తవ్యస్తమైందని, కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితమయ్యారని అన్నారు.
గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఉన్న వాటిని తొల గించేందుకు విచారణ పేరిట కొత్త డ్రామాను తెరమీదికి తెచ్చిందని దుయ్యబట్టారు. మొత్తం మీద ఏ కార్యక్రమం చేసినా ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే మేలు జరిగేలా పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల ద్వారా గెలుపొందిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అధికార పార్టీ వారితో జన్మభూమి కోసం కమిటీలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా బాండ్లను ఇస్తే వాటిని నేలకేసి రాసుకోవాలా అని మండిపడ్డారు. ఆ బాండ్లు మెచ్యూర్డ్ అయ్యాక డబ్బు తీసుకోవచ్చని, అంతవరకు తీసుకున్న రుణాలు కట్టాల్సిం దేనని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఓ వైపు రైతులు, మరో వైపు పింఛన్‌దారులు, ఇంకో వైపు డ్వాక్రా మహిళలు ఆగ్రహంతో రగిలిపోతుంటే ఏ మొహం పెట్టుకొని జన్మభూమి కోసం గ్రామాల్లోకెళ్తారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకొచ్చాక రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో కార్పొరేటర్ల పెత్తనం సాగిందని ఆరోపించారు. మొత్తం మీద ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చాంద్‌బాషా, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.