విద్యార్థుల పోరుకేక.. కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 84వరోజూ మంగళవారం ఉధృతంగా సాగింది. రాష్ర్టం ముక్కలైతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందంటూ విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీలో జరిగిన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థుల సదస్సు ఎంపీలు రాజీనామాలు చేసేవరకు ఉద్యమించాలని తీర్మానించింది. కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించిన విద్యార్థి గర్జన జరిగింది. రాష్ట్రం విడిపోతే ఉపాధి అవకాశాలు మృగ్యమై విద్యారంగం తిరోగమనం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. కర్నూలు లో భూగర్భ జలశాఖ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపుమేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రహోంమంత్రి షిండేకు మెసెజ్‌ల ద్వారా సమాచారం పంపించారు. ముదినేపల్లి మండలం చిగురుకోటలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు గడపగడపకు మేల్కొలుపు పేరుతో ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేటలో విద్యార్థులు పిరమిడ్‌ల ఆకారంతో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కలిదిండి సెంటరులో రైతులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో కదంతొక్కుతున్న పార్టీ శ్రేణలు మంగళవారం కూడా విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శిబిరం వదే ్ద రోడ్డు పక్కన చెప్పులు కుట్టి, బూట్ పాలిష్ చేసి, రోడ్లు శుభ్రం చేసి నిరసన తెలిపారు. తిరుపతిలో తుడా మైదానం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూటలుమోసి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఇలా మూటలు మోసుకొని వచ్చే ఆదాయంతో జీవించాల్సిందేనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ శ్రీకాళహస్తిలో పార్టీ నేత బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు కల్యాణి ఆధ్వర్యంలో వృత్తి పనివారు, రైతులు, రజకులు, చేనేత కార్మికులు పనిముట్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెంలో పార్టీ కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే ధర్నా చేపట్టారు. ఇక ఈనెల 2వతేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి.