రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక పనవాలు వీస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. ఓటుకు నోటు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ కోటరీలో కీలక నేతగా ఉన్న నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణకు ఓటమి భయం పట్టుకుంది. నోట్ల కట్టలు తెగ్గొట్టేశారు. కేవలం నోట్లతో ఓట్లు కొల్లగొట్టాలని నగర పరిధిలో నోట్లు వరదలా పారిస్తున్నారు. నెల్లూరు నగర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న నారాయణకు రోజు రోజుకు ప్రజాదరణ తగ్గిపోతోంది. ఓటమిపై బెంగతో తమ విద్యాసంస్థల ఉద్యోగులతో ఓటర్లకు నగదు చేర వేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలకు పట్టుబడుతున్నారు. నగదు పంపిణీ కష్టతరం కావడంతో చివరకు విద్యార్థుల స్కూల్ బ్యాగుల ద్వారా చోటా నేతలకు నగదు చేర వేస్తున్నట్లు తెలిసింది.
సాక్షి, నెల్లూరు: ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని మంత్రి నారాయణ టీడీపీ కోటరీలో మాత్రం కీలక నేతగా ఎదిగారు. రెండు దశాబ్దాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. చంద్రబాబుకు బినామీ అని కూడా ప్రచారం ఉంది. ఎన్నికల సమయంలో నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగులతో సర్వేలు చేయిస్తూ, పార్టీకి భారీ విరాళాలతో ఆర్థిక వనరులు సమకూర్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్న 1994–1999, 1999–2004 మధ్య కాలంలో నారాయణ విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించారు.
నెల్లూరులో ప్రైవేట్ మెడికల్ కళాశాలను నారాయణకే కేటాయించేలా చేయడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారు. ఇలా నారాయణ, చంద్రబాబు మధ్య ఇంతటి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. బాబుకు బినామీగా ఉన్న నారాయణ ప్రతి సాధారణ ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాలు చక్క బెట్టేవారు. రాష్ట విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అధికారంలోకి తెప్పించేందుకు వందల కోట్లు నిధులను తన విద్యాసంస్థల ద్వారా సమకూర్చి, వారి ఉద్యోగులను కూడా ఎన్నికల సమయంలో పార్టీకి కార్యకర్తలా పనిచేయించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నారాయణ స్వామి భక్తికి మెచ్చిన సీఎం చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేని నారాయణకు తన కేబినేట్‌లో కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు.
ఆది నుంచి స్వార్థమే.. దోపిడీ
నారాయణ విద్యాసంస్థల అధినేతగా గుర్తింపుతోనే నారాయణ నెల్లూరు వాసులకు పరిచయం. నెల్లూరీయుల ఇచ్చిన ప్రోత్సాహంతో విద్యా సంస్థలను స్థాపించిన నారాయణ ఎన్నడూ నెల్లూరు వాసులకు సేవా కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. తనతో చదువుకున్న స్నేహితులను కూడా కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తిత్వం కాదనే ప్రచారం ఉంది. నారాయణ విద్యాసంస్థల్లో పేద వర్గాలను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
నారాయణ మెడికల్ కాలేజీలో రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేశారన్న ప్రచారం ఉంది. నారాయణ ఆస్పత్రిలో ఠాగూరు సినిమా సీన్లు జరిగిన ఘటనలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్‌లో దాదాపు 10 మందికి పైగా మెడిసిన్ చదివే విద్యార్థినులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి అవినీతి, అక్రమాల మరకలు ఉన్న నారాయణ మంత్రిగా పని చేసిన ఐదేళ్ల కాలంలో కూడా అవినీతినే ప్రొత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగడంతో ప్రజాదరణ లే క ఓటమి భయం పట్టకుంది. ఎలాగైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.
డబ్బు పంచుతూ..
నెల్లూరు నగరంలో ఓటుకు నోటు పంచుతూ నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు పట్టుబడ్డారు. మూడు రోజుల క్రితం 43వ డివిజన్‌లో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు డబ్బు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద రూ.8 లక్షల నగదు దొరికింది. సోమవారం కూడా 40వ డివిజన్‌లో నగదు పంచుతున్న నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి బాలమురళీకృష్ణ పట్టుబడ్డారు. ఇలా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నగదు ప్రవాహంలా చేసి అడ్డదారుల్లో గెలుపు కోసం నారాయణ చేస్తున చర్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి.
పోలీసుల సహకారం
ఎన్నికల సమయంలో ఎన్ని అడ్డదారులు తొక్కినా ఏమి కాకుండా పోలీసుల సహకారం కూడా మంత్రి నారాయణ తీసుకుంటున్నారు. ఎన్నికల కోసమే తనకు అనుకూలమైన పోలీసు అధికారులను నగరంలో సీఐలుగా నియమించుకున్నారు. వారి ద్వారానే కొన్ని పనులు కూడా చక్కబెట్టించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
విద్యార్థులు బ్యాగుల ద్వారా..
నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులను కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం విమర్శల పాలవుతోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండే పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారి బ్యాగుల ద్వారా ఓటుకు నోట్లు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment