ఖర్చులిస్తాం..పోటీ చేయండి..! | money to compete for the dignity of being | Sakshi
Sakshi News home page

ఖర్చులిస్తాం..పోటీ చేయండి..!

Published Tue, Apr 8 2014 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

money to compete for the dignity of being

సాక్షి ప్రతినిధి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూలేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థే దొరకని దుస్థితి దాపురించింది.

వైఎస్ హయాంలో పార్టీ అత్యున్నత స్థాయిలో ఉండటంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఆశావహులు అధికంగా సీట్ల కోసం పోటీపడేవారు. ప్రస్తుతం పార్టీ ప్రతిష్ట అథఃపాతాళానికి దిగజారడంతో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వెదుకులాట మొదలెట్టింది.
 
వారం రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పీసీపీ సమావేశానికి వెళ్లిన సందర్భంలో జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్థిని కూడా ఒప్పించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి వారికి ఖర్చులకు పార్టీయే కొంత డబ్బు ఇచ్చేలా రాయబేరాలు జరిపారు. విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ప్రకటించిన అధిష్టానం బందరు సీటుపై తటపటాయిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ స్థానంలో పోటీచేసేందుకు అభ్యర్థి దొరకకపోవడమేనన్నది నిర్వివాదాంశం. బందరు లోక్‌సభ నియోజకవర్గానికి విజయవాడకు చెందిన ఐలాపురం వెంకయ్య కుమారుడిని పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
 
 రండి బాబూ.. రండి!
 జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఆ పార్టీ ఇంతవరకు నిర్ణయించలేదు. జిల్లాలో ఏ స్థానంలోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోగా, సిట్టింగ్‌లు సైతం పోటీకి సిద్ధంగా లేమంటున్నారు. ఒక్క పామర్రు ఎమ్మెల్యే మినహా మిగిలిన వారందరూ ఇప్పటికే పార్టీ గోడలు దూకారు.
 
దీంతో ఎమ్మెల్యేగా పోటీచేస్తే కనీసం రూ.15 లక్షలు ఖర్చులకు ఇస్తామని, ఏదోవిధంగా ఒప్పుకోవాలని కాంగ్రెస్ కీలక నేతలు బతిమాలుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో కనీసం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగిందనే సంకేతాలు రావాలని పీసీసీ భావిస్తోందని వారు స్థానిక నాయకులకు చెబుతున్నారు. గతంలో పార్టీ నిధి కింద డబ్బులిస్తేనే టిక్కెట్ ఇచ్చేవారని, ఇప్పుడు ఎదురు పెట్టుబడి పెట్టి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని జనం విస్తుపోతున్నారు.
 
 భవిత కోసం బెంగ...
జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ భవిత కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావులు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. జిల్లాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, బాడిగ రామకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్‌లు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాడిగ రామకృష్ణకు టీడీపీ తలుపులు తెరిచిందని, సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావును ఒప్పించి ఆయన సీటును మార్చే విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement