కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని గురువారం రాత్రి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు తొలిగా పలకరించే కేరళలో గురువారం వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే, అవి రుతుపవనాల వల్లనే పడుతున్న వర్షాలని కచ్చితంగా చెప్పలేమని వారు తెలిపారు. జూన్ 1నే పలకరించాల్సిన వర్షాలు ఈ సంవత్సరం ఆలస్యమయ్యాయన్నారు.
48 గంటల పాటు ఆగకుండా వర్షం పడటం, 15 నుంచి 20 నాట్ల వేగంతో గాలులు వీయడం.. రుతుపవనాల ఆగమనానికి ముఖ్య సూచికలుగా భావించాలని వారు వివరించారు. ఇప్పుడు వాతావరణం నైరుతికి అనుకూలంగా ఉందన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, శ్రీలంక తీరం వరకు ఆవరించాయని, రాగల 24 గంటల్లో కేరళ తీరంతోపాటు దక్షిణ అరేబియా, కామెరూన్, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
కేరళతో పాటు లక్షద్వీప్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడుల్లో అక్కడక్కడ గురువారం వర్షాలు పడ్డాయని తెలిపింది. మరోవైపు, ఉత్తర భారతాన్ని ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం 46.3 సెల్సియస్ డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదయింది. గత 33 ఏళ్లలో జూన్ మాసంలో అక్కడ నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. ఢిల్లీలోనూ గత ఐదేళ్లలోనే అత్యధికమైన 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.