మోపిదేవి మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. అనారోగ్య కారణాలరీత్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను శనివారం తోసిపుచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మోపిదేవి కోరిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన వ్యక్తిగత డాక్టరు పరిశీలనలో జైలు అధికారుల పర్యవేక్షణలో అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేయించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.
నిబంధనలు అనుమతిస్తే, వైద్య పరీక్షలను ప్రభుత్వ ఖర్చుతో, లేదంటే మోపిదేవి సొంత ఖర్చులతో పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయించుకోవాలని మోపిదేవి నిర్ణయించుకుంటే, సంబంధిత మెడికల్ రికార్డుతో తిరిగి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని, రికార్డుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ ప్రత్యామ్నాయం కాదన్న న్యాయాధికారి, రెండో అభిప్రాయం కోసం పరీక్షలు చేయించుకుంటామని కోరడాన్ని తప్పుపట్టలేమని పేర్కొన్నారు.