హైదరాబాద్: రాష్ట్రంలో మందుబాబులకు మద్యం కొరత లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం డిమాండ్‌కు తగ్గట్టుగా మద్యం తయారీని పెంచేందుకు కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. రాష్ట్రంలో డిస్టిలరీల (మద్యం తయారీ సంస్థలు) తగినన్ని లేకపోవడం, ఉన్నవాటిలోనూ తయారీ అంతంతమాత్రంగానే ఉండడంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతోంది. దీంతో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
దీనివల్ల ఇతర రాష్ట్రాల్లో ఎగుమతి సుంకం, ఆంధ్రప్రదేశ్‌లో దిగుమతి సుంకాన్ని భరించక తప్పడంలేదు. దీనికి బదులు రాష్ట్రంలోనే మద్యం తయారీ యూనిట్లను ఏర్పాటుచేయిస్తే మద్యం కొరత తీరడంతోపాటు రాష్ట్రానికీ ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనాకొచ్చింది. గత కొద్దిరోజులుగా దీనిపై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేపట్టింది. యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం ఉద్దేశ పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
డిస్టిలర్లు యూనిట్లు ఏర్పాటు చేసి లెసైన్సు పొందేందుకు అవసరమైన పత్రాలు, రూ.20 లక్షల స్పెషల్ ఫీజుతో సర్కారుకు దరఖాస్తు చేసుకునేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కొరత ఇబ్బందుల్లేవని, కొత్త డిస్టిలరీల మంజూరు, విస్తరణ అంశాల్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు డిస్టిలరీ యూనిట్లలో అధికశాతం తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 29 ఐఎంఎఫ్‌ఎల్ డిస్టిలరీలలో పది ఆంధ్రప్రదేశ్‌లో, 19 తెలంగాణలో ఉన్నాయి.
*ఆంధ్రప్రదేశ్‌లోని 10 డిస్టిలరీ యూనిట్లలో తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కటి, పశ్చిమగోదావరిలో 3, కృష్ణాలో రెండు ఉన్నాయి. ప్రస్తుతం ఈ డిస్టిలరీల మద్యం తయారీ సామర్థ్యం డిమాండ్‌కు తగ్గట్టుగా లేదు. డిస్టిలరీల సామర్థ్యాన్నిబట్టి 7 లక్షల లీటర్ల ఐఎంఎఫ్‌ఎల్ మద్యం, 4 లక్షల లీటర్ల బీరు కొరత ఉంటోందని ఎక్సయిజ్ అధికారులు చెబుతున్నారు.
*తెలంగాణలోని డిస్టిలరీ యూనిట్లలో డిమాండ్‌కు మించి మద్యం తయారీ అవుతున్నా అక్కడినుంచి ఆంధ్రప్రదేశ్‌కు తెప్పించాలంటే ఎగుమతి సుంకాన్ని ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అదేసమయంలో రాష్ట్రంలోనూ దిగుమతి సుంకం విధించక తప్పదు. ఈ పన్నుల విధానంలో ఇరురాష్ట్రాల మధ్య స్పష్టత లేదు.
*తెలంగాణలోని డిస్టిలరీ యూనిట్ల నుంచి కొంతమేర ఆంధ్రప్రదేశ్‌కు మద్యం సరఫరా అవుతున్నా అది సరిపోవడంలేదు. మరోవైపు పెద్ద బ్రాండ్లకు కొరత ఏర్పడినప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లోని ఐఎంఎఫ్‌ఎల్ డిపోల నుంచి మద్యం సరఫరా అవుతోంది. అప్పుడు ఎగుమతి, దిగుమతి సుంకాలన్నీ కలుపుకుని లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు అదనపు భారం పడుతోంది.
*కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన ఎక్సయిజ్ అధికారుల భేటీలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణలోని ఐఎంఎఫ్‌ఎల్ డిస్టిలరీ యూనిట్ల యాజమాన్యాలు తమ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తామని పేర్కొంటున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడంపై ప్రభుత్వం విముఖతను తెలిపింది. అలా చేయడం కన్నా కొత్త యూనిట్ల స్థాపన చేస్తేనే మంచిదని అధికారులకు సూచించింది.
*డిస్టిలరీ యూనిట్ల స్థాపనకు ఆంధ్రప్రదేశ్‌లోనే పలువురు ముందుకు వస్తారని, వారికి అవకాశం కల్పించాలన్న దిశగా ఆలోచన చేశారు. ఈ మేరకు మద్యం డిమాండ్‌కు తగ్గట్టుగా వీలైనన్ని ఎక్కువ డిస్టిలరీ యూనిట్లు నెలకొల్పడంతోపాటు, ప్రస్తుతమున్న డిస్టిలరీల సామర్థ్యం పెంపునకు అనుమతించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడింటిలో మాత్రమే మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయి. ఆ యూనిట్లు లేని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు.
మందుబాబులకు కొరత రానీయొద్దు!
Published Tue, Jul 15 2014 9:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement