సాక్షి ప్రతినిధి, కర్నూలు : కాకినాడకు చెందిన పూర్ణచంద్రరావు, రమాదేవి దంపతులు కొద్దిరోజుల క్రితం కర్నూలులోని అశోక్‌నగర్‌లో కొత్త కాపురం పెట్టారు. భర్త కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొత్తగా కాపురం పెట్టటంతో నిత్యావసరాలతో పాటు గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. పూర్ణచంద్రరావు గ్యాస్ కనెక్షన్ కోసం నగరంలోని ఓ ఏజెన్సీ వద్దకెళ్లారు. గ్యాస్ కనెక్షన్ కావాలి? ఎంత? అని అడిగారు. ఏజెన్సీ యజమాని అప్లికేషన్‌ను పూర్తి చేయించారు. సింగిల్ సిలిండర్ కావాలంటే రూ.5 వేలు, డబుల్ సిలిండర్ అయితే రూ.9 వేలు చెల్లించమని డిమాండ్ చేశాడు.
‘అదేంటి సార్. అంత లేదు కదా?’ అంటే..
‘మీకు అవసరమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి. వెంటనే కావాలంటే అంతే. మీరు చెప్పిన ధరకు కావాలంటే నెలో.. రెండు నెలలో పడుతుంది. సీరియల్ ప్రకారం సమాచారం ఇస్తాం. అప్పుడు రండి. వెళ్లండి’ అని చెప్పటంతో చేసేది లేక అవసరం కోసం ఏజెన్సీ వారు అడిగినంత ఇచ్చి సిలిండర్లును తీసుకెళ్లారు. ఇలా జిల్లాలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి.
దోపిడీ ఇలా...
జిల్లాలో 51 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి రోజు కొత్త కనెక్షన్ కోసం ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. గ్యాస్ కోసం వచ్చే వారి అవసరాలను గుర్తించి ఏజెన్సీ యజమానులు భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూ సామాన్య ప్రజల నుంచి దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సింగిల్ సిలిండర్ కనెక్షన్ కావాలంటే రూ.2450 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో డిపాజిట్ రూ.1450, గ్యాస్ సిలిండర్ రూ.450, గ్యాస్ పైప్ రూ.150, రెగ్యులేటర్ రూ.250, లైటర్ రూ.50, సర్వీస్ చార్జ్ రూ.100 ఉంటాయి అయితే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఏకంగా రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. అదే డబుల్ సిలిండర్ కావాలంటే రూ.7 వేల నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే డబుల్ సిలిండర్ కావాల్సి వస్తే అదనంగా రూ.450 చెల్లిస్తే రెండు సిలిండర్లు ఇవ్వాలి. ఏజెన్సీలు అందుకు వ్యతిరేకంగా దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నాయి.
మామూళ్ల మత్తులో... కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వెచ్చించి లెసైన్స్ దక్కించుకుంటున్నారు. భారీ మొత్తంలో చెల్లించటంతో ఆ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఏజెన్సీలు నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా వసూళ్లు చేసి దండుకుంటున్నాయి. ఈ దోపిడీపై ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువవుతోంది. ఏజెన్సీ యజమానులు సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇస్తుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
అశోక్‌నగర్‌కు చెందిన రమాదేవి, శరీర్‌నగర్‌కు చెందిన రామాంజనేయులు ఏజెన్సీ దోపిడీ గురించి వేరువేరుగా ఇద్దరు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. తాము ఫిర్యాదు చేసిన విషయాన్ని వెంటనే సంబంధిత ఏజెన్సీ వారికి ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారని వారు వెల్లడించారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలను రద్దు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
కనెక్షన్.. కలెక్షన్
Published Fri, Aug 22 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement