అంగన్‌వాడీల్లో మరింత పౌష్టికాహారం | More Nutrition In Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో మరింత పౌష్టికాహారం

Published Thu, Jul 26 2018 2:28 PM | Last Updated on Thu, Jul 26 2018 2:28 PM

More Nutrition In Anganwadi - Sakshi

గర్భిణులు, బాలింతలకు అందించనున్న బెల్లంతో తయారుచేసిన వేరుశనగ, నువ్వు చెక్కీలు 

పోషణ అభియాన్‌ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం నుంచి మరింత పౌష్టికాహారం అందనుంది. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ పథకం ద్వారా జిల్లాను పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అవకాశం రానుంది. ఇది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.

రామభద్రపురం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పోషణ అభియాన్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మరియు ఇతర జనాభాలో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లల పోషణ స్థితి మెరుగుదలకు అదనపు పౌష్టికాహారం అందించే ప్రత్యేక కార్యక్రమం అంగన్‌వాడీల్లో అమలు కానుంది.

రక్తహీనత గల హైరిస్క్‌ గర్భిణులు, బాలింతలు, తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఈ నెల 27న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్ల 3,728 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషణ అభియాన్‌ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నారు.

గర్భిణులు, బాలింతలకు హీమోగ్లోబిన్‌ తక్కువగా ఉండడంతో పాటు పొడవు 45 సెంటీమీటర్లు, 35 కిలోల కంటే తక్కువ ఉన్న వారికి, చిన్న వయసులో వివాహం జరిగి గర్భం దాల్చిన వారికి, 35 సంవత్సరాలు తరువాత గర్భం దాల్చిన వారికి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తారు.

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 1.46 లక్షల మంది పిల్లలు ఉండగా వారిలో తీవ్ర పౌష్టికాహార లోపంతో రక్తహీనత కలిగిన ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు ఉన్న పిల్లలు 18 వేల మంది ఉన్నారు. వీరందరికీ రోజూ అందిస్తున్న మెనూతో పాటు కొత్త మెనూ ప్రకారం ప్రతి రోజూ ఒక గుడ్డు, 200 గ్రాముల పాలు అదనంగా ఇవ్వనున్నారు.

రక్తహీనత హైరిస్క్‌ గల గర్భిణులు, బాలింతలకు రోజూ అందిస్తున్న మె నూతో పాటు రోజూ ఉదయం 50 గ్రాముల బెల్లంతో తయారు చేసిన వేరుశనగ చెక్కి, మధ్యాహ్నం ఒక గుడ్డు, వంద మి.లీ. పాలు, సాయంత్రం 50 గ్రాముల నువ్వల చెక్కి అదనపు పౌష్టికాహారంగా అందివ్వనున్నట్టు అధికారిక సమాచారం.

రేపటి నుంచి కొత్త మెనూ 

'అంగన్‌వాడీ కేంద్రాలలో తీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు కోసం పోషణ అభియాన్‌ పథకం ద్వారా కొత్త మెనూ ప్రారంభించనున్నాం. బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఈ కొత్త మెనూను సద్వినియోగ పరుచుకుంటే పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చును. పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఈ పథకం అమలు కానుంది.  – వసంతబాల, ఐసీడీఎస్‌ పీడీ, విజయనగరం

సంతోషంగా ఉంది..

గతంలో గర్భిణులకు, బా లింతలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు నేను సైతం అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిం ది.  ఈ పథకంలో భాగంగా దాతలు ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని సేకరించి అందించాం.

ఇక నుంచి ప్రభుత్వమే అదనపు పౌష్టికాహారం అందించనుంది. కాబట్టి దాతలను ఆశ్రయించాల్సిన పని ఉండదు. ప్రభుత్వమే అదనపు ఆహారం అందించడం సంతోషంగా ఉంది.          – యర్రయ్యమ్మ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్, రామభద్రపురం  
 
పౌష్టికాహారం అందించేందుకే...

బెల్లంలో ఐరన్, వేరుశనగ, నువ్వులలో ప్రోటీన్స్‌ ఉంటాయి. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, హైరిస్క్‌ అధికంగా ఉంటోంది. పిల్లల్లో పొడవు, బరువు తగ్గే అవకాసం ఉంటుంది. వీరికి శనగ, నువ్వులు చెక్కీలు, పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారం అందించడం వల్ల వారిలో ఉన్న పోషక లోపాన్ని అధిగమించవచ్చు.

– హెచ్‌కె కామాక్షి, సీడీపీఓ, సాలూరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement