మహా కష్టాలు అడుగడుగునా అడ్డంకులే
- ఎక్కడికక్కడ స్తంభించిన వాహనాలు
- జనం ఇబ్బందులు
- చేతులెత్తేసిన పోలీసులు
విజయవాడ సిటీ : ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు’ మహా సంకల్పం తమకు ఇక్కట్లను కొని తెచ్చిందంటూ బెజవాడ వాసులు వాపోయారు. తెలుగు తమ్ముళ్లు నేతల మెప్పు కోసం చేసిన హంగామా ట్రాఫిక్ చిక్కులు సృష్టించింది. అసలే పెరిగిన ట్రాఫిక్‌తో ఇక్కట్లు పడుతున్న ప్రజలను తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం మరింత ఇబ్బందులకు గురి చేసింది. అత్యవసర పనులపై వెళ్లేవారు, ఆస్పత్రులకు వెళ్లేవారు ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు లోనయ్యారు. బహిరంగ సభకు వెళ్లే వాహనాలను ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతించడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జాతీయ రహదార్లపై ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు సిటీలోని ట్రాఫిక్‌ను గాలికొదిలేశారు. అక్కడక్కడా కానిస్టేబుళ్లు, హోంగార్డులు ర్యాలీలు, ప్రదర్శనలను గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను నేతలు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరించాలంటూ ఆదేశించడంతో.. విధుల్లో ఉన్న సిబ్బంది ప్రజలను వారి మానాన వారిని వదిలేసి మిన్నుకుండిపోయారు. ఓ పక్క ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమైన వీరికి.. ఆర్టీసీ బస్సుల కుదింపు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. పలు ప్రాంతాల్లో ఆటోలను ఆపకుండా పంపేసిన పోలీసులపై ప్రయాణికులు ఎదురుదాడికి దిగారు. సోమవారం అనేక ప్రాంతాల్లో పోలీసుల చర్యల కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ప్రదర్శనలు...
నగరంలోని తెలుగుదేశం శ్రేణులు అన్ని ప్రాంతాల నుంచి విడివిడిగా వాహనాలు, మోటారు సైకిళ్ల ర్యాలీలు నిర్వహించి మహా సంకల్ప దీక్షకు తరలి వెళ్లారు. తాము నిర్వహించే కార్యక్రమాలు ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే అభిప్రాయంతో రద్దీ మార్గాల్లోనే వీరు తమ కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్, అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై తెలుగుదేశం పార్టీ చేసిన హంగామాతో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
పాతబస్తీ, కెనాల్ రోడ్డు, సూర్యారావుపేట ఆస్పత్రుల ప్రాంతం, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్, ఐదో నంబర్ రూట్‌లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఇబ్బందులే. వాహనాలు ముందుకు కదలక, ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించక వాహన చోదకులు గంటల కొద్దీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోయారు. ఏలూరు వైపు రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులను ఏలూరు రోడ్డు మీదుగా మళ్లించడంతో ర్యాలీలు, ప్రదర్శనల కారణంగా అవి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల కొద్దీ బస్సుల్లోనే మగ్గారు.
బ్యారేజీపై కదలని ట్రాఫిక్
నిబంధనలకు విరుద్ధంగా ప్రకాశం బ్యారేజీపై బహిరంగ సభకు వెళ్లేవారిని అనుమతించడంతో గుంటూరు వైపు రాకపోకలు నిర్వహించే సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసు అధికారుల ముందస్తు ప్రకటనల ప్రకారం బహిరంగ సభతో నిమిత్తం లేని సాధారణ వాహనాలు, గుంటూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రమే బ్యారేజీపై అనుమతి ఉంది. ఇందుకు భిన్నంగా పశ్చిమ కృష్ణా, పాతబస్తీ ప్రాంతాల నుంచి బహిరంగ సభకు జనాలను తరలించే వాహనాలను బ్యారేజీపై అనుమతించారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కూడా తమకెందుకొచ్చిన తంటా అని చేతులెత్తేశారు.
బస్సులు లేక ఇబ్బందులు
ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ బస్సులను కుదించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల బస్సులతో పాటు సిటీ, పల్లె వెలుగు బస్సులను బహిరంగ సభకు జనాలను తరలించేందుకు మళ్లించారు. ఆర్టీసీ బస్సులు లేక, ఆటోలు ఎక్కలేక అనేక మంది కాలినడకనే గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఏమీ సాధించకుండానే ఏడాది పాలన పేరిట సంబరాలంటూ ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం రానున్న రోజుల్లో మరెన్ని పాట్లకు గురి చేస్తుందోనంటూ పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.