ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడులో 20కి పైగా తీర్మానాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
హైదరాబాద్: ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడులో 20కి పైగా తీర్మానాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో రాజకీయ తీర్మానం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు, తెలుగు భాష, తెలుగుజాతి ఐక్యత, టీడీపీని జాతీయ పార్టీగా మార్చడం వంటివి ఉమ్మడిగా ఉంటాయి. మిగిలినవి తెలంగాణ, ఏపీల్లో పార్టీ వైఖరికి అనుగుణంగా ఉంటాయి. మంగళవారం రాత్రి ఎన్‌టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం జరిగింది.
అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షత వహించారు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బాబు సూచించారు. కాగా మహానాడులో చేయనున్న తీర్మానాల ముసాయిదా ప్రతులను జిల్లాలకు పంపనున్నారు. వాటిపై ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే జిల్లా మహానాడుల్లో నేతలు చర్చించి సూచనలు, సలహాలు చేయాలి. వాటిలో ప్రధానమైన వాటిని పొందుపరిచి తీర్మానాలకు తుది రూపం ఇస్తారు.