సాక్షి, గుంటూరు: అతి వేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఒకే ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఈ సంఘటనల్లో మొత్తం 15 మందికి పైగా తీవ్రగాయాలు అవ్వగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు అతి సమీపంలో జరిగి ప్రమాదంలో మార్నింగ్ స్టార్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డిపాలెం వద్ద లారీని తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
అదే ట్రావెల్స్ మరో చోట: గుంటూరు జిల్లాలోనే మార్నింగ్ స్టార్‌కు చెందిన మరో బస్సు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యింది. బాపట్లకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఎదరుగా వస్తున్న ఆటోను మార్నింగ్‌స్టార్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment