దోమల ఉత్పత్తి కేంద్రం ‘రామతీర్థం’ | Mosaic production center 'Ramathirtham' | Sakshi
Sakshi News home page

దోమల ఉత్పత్తి కేంద్రం ‘రామతీర్థం’

Published Thu, Aug 31 2017 5:09 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

దోమల ఉత్పత్తి కేంద్రం ‘రామతీర్థం’ - Sakshi

దోమల ఉత్పత్తి కేంద్రం ‘రామతీర్థం’

నిరుపయోగంగా ఉన్న క్వారీ గుంతలే దోమల కేంద్రాలు
అటకెక్కిన దోమలపై దండయాత్ర
గంబూషియా చేపలను వదిలి చేతులు దులుపుకున్న అధికారులు
రామతీర్థం, చీమకుర్తి, చుట్టుపక్కల గ్రామాల్లో విషజ్వరాలు, డెంగీ బాధితులు
చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం


చీమకుర్తి రూరల్‌:  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామతీర్థం  గెలాక్సీ గ్రానైట్‌కే కాదు దోమల ఉత్పత్తికి కూడా పేరుగాంచిందే. ఒకటి రెండురోజులు రామతీర్థంలో నిద్రిస్తే మలేరియా, డెంగీ, లేక ఇతర విషజ్వరాలు రావాల్సిందే. రామతీర్థంలోని ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎవరైనా ఉంటే రాత్రుళ్లు అక్కడ నిద్రించ వద్దని సంతనూతలపాడు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఒక డాక్టర్‌ స్థానిక వైద్య సిబ్బంది ద్వారా సంతనూతలపాడు వాసులకు తెలియజేయడం చూస్తే దోమల ప్రభావం రామతీర్థం, దాని పరిసరాల్లో ఎంత ఎక్కువుగా ఉందో తేట తెల్లమవుతుంది.

గ్రానైట్‌ గుంతలే టార్గెట్‌
రామతీర్థంలో దోమలు ఎక్కువుగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడ ఖాళీగా నిరుపయోగంగా ఉన్న గ్రానైట్‌ గుంతల్లో ఏళ్ల తరబడి నిల్వ ఉన్న నీరే. దోమలు పెరగడానికి ఆ నీరే ప్రధాన వనరుగా మారింది. ఇలాంటి క్వారీలు దాదాపు 50కి పైగా ఉన్నాయి. వాటితో పాటు రామతీర్థం పుణ్యక్షేత్రంలో కోనేరు, ఆలయాలు, సత్రాలకు చెందిన బావులు మరో పది వరకు ఉన్నాయి. వాటిలో ఎప్పుడో కార్యక్రమాల సమయంలో తప్ప భక్తులు ఆ నీటిని వాడే అవకాశం రాదు. అందువలన నీరు నిలకడగా ఉండటం వలన దోమల లార్వాలు పెరిగి దోమలుగా మారడానికి అనుకూలంగా ఉందని మలేరియా డిపార్టుమెంట్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

విషజ్వరాలు నమోదు     
 దోమల వలన వచ్చిన మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి విషజ్వరాలు చీమకుర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించడానికి అనూకూలంగా మారింది. ఫలితంగా చీమకుర్తి మండలంలో నెలకు 30–40కు పైగా విషజ్వరాలు, మలేరియా, చికున్‌ గున్యా కేసులు నమోదు అవుతున్నాయి. మండలంలోని దేవరపాలెం, పాటిమీదపాలెం, బండ్లమూడి గ్రామాల్లో వందల సంఖ్యలో స్థానికులు విష జ్వరాలతో మంచానపడిన సంగతి తెలిసిందే.

గంబూషియా చేపల ప్రభావం నామమాత్రమే
దోమల నివారణకు అధికారులు గంబూషియా చేపలను వదులుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రామతీర్థంలోని ఖాళీగా ఉన్న క్వారీ గుంతలు,  మోక్షరామలింగేశ్వరస్వామి, గంగమ్మ ఆలయాలు, సత్రాలు, కోనేరు వద్దనున్న 19 ప్రాంతాలను ఎంపిక చేసి లక్షకు పైగా గంబూషియా చేపలను స్వయంగా డీఎంఓ నాగేంద్రయ్య గుంతల్లో వదిలిపెట్టారు. ఇలా గత ఐదేళ్లలో ఇప్పటికీ నాలుగు సార్లు గంబూషియా చేపలను వదిలిపెట్టారు. గతంలో చేపలతో పాటు ఆయిల్‌బాల్స్, మడ్డి ఆయిల్‌ను నీటి గుంతల్లో చల్లేవారు. అప్పటి చేపలు ఇప్పడూ కూడా ఉన్నాయి. కానీ మలేరియా రోగాలు తగ్గడం లేదు కదా..అదనంగా డెంగీ జ్వరాలు చుట్టుకున్నాయి. దోమల నివారణకు ప్రభుత్వం అట్టహాసంగా ఏడాది క్రితం ప్రారంభించిన దోమలపై దండయాత్ర కార్యక్రమం అటకెక్కింది. గ్రామాల్లో కనీసం నెలకోసారైనా దోమలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఊరంతా జ్వరాలతో మంచాన పడితే ఆ రెండు మూడు రోజులు హడావుడి చేయడం తప్ప గ్రామాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.

 గంబూషియా చేపలు వదిలాం
దోమల నివారణకు రామతీర్థం కేంద్రంలోని క్వారీ గుంతల్లో గంబూషియా చేపలను వదిలాం. దోమల లార్వాలను తినడం వలన దోమలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.
– నాగేంద్రయ్య, డీఎంఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement