దోమ కుట్టినట్లు కూడా లేదు..
నగర పాలక సంస్థ అధికారుల పనితీరు అధ్వానం నగరంలో లోపించిన పారిశుద్ధ్యం
కర్నూలు(జిల్లా పరిషత్) :
దోమలు.. రక్తం పీలుస్తూ కర్నూలు నగర వాసులకు నిదుర లేకుండా చేయడమే కాక.. భారీగా ఖర్చు పెట్టిస్తున్నాయి. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంతో చిన్న చిన్న కుంటలు, మురుగు కాలువలు వీటికి ఆవాసంగా మారాయి. వీటి బారిన పడి ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దోమల బారి నుంచి తప్పించుకోవడానికి 99 శాతం మంది ప్రజలు మస్కిటో కాయిల్స్, మస్కిటో లిక్విడ్స్, ఇతర స్ప్రేలను పెద్ద మొత్తంలో వాడుతున్నారు.
ఫలితంగా కర్నూలు నగరంలోని ప్రజలు దోమల నుంచి రక్షించుకోవడానికి, దోమల బారిన పడి జ్వరాలు నయం చేసుకునేందుకు వైద్యం కోసం ప్రతి నెలా రూ. కోటికి పైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దోమల బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉంది.
నగర పాలక సిబ్బంది నిర్లక్ష్యం..
కర్నూలు నగర పాలక సంస్థ సిబ్బంది పనితీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నా వీరికి ‘దోమ’ కుట్టినట్లు కూడా లేదు. కర్నూలు నగరంలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 80 వేలకు పైగా గృహాల్లో 5 లక్షల పై చిలుకు జనాభా నివాసం ఉంటోంది. కార్పొరేషన్‌లోని ఆరోగ్య విభాగం పరిధిలో 13 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. మొత్తం 11 మంది శానిటరి ఇన్స్‌పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు గాను 470 మంది కార్మికులు ప్రతిరోజూ పనిచేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
దోమల నివారణకు, నిర్మూలనకు గాను నగర పాలక సంస్థలోని మలేరియా విభాగంలో 20 మంది రెగ్యులర్ మజ్దూర్లు, మరో 25 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే మజ్దూర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు సిబ్బందికి ప్రతి యేటా రూ. 23 లక్షల వేతనాన్ని ఇస్తున్నారు. వీరిపై ఇద్దరు మలేరియా శానిటరి ఇన్స్‌పెక్టర్లు, ఒక సీనియర్ ఎంటమాలజిస్టు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత మంది పని చేస్తున్నా పారిశుద్ధ్యం మెరుగు పడటం లేదు.
ఫార్స్‌గా ఫాగింగ్ కార్యక్రమం
దోమల నివారణలో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డుల్లో ఫాగింగ్ చేసేందుకు డీజిల్, పెట్రోల్, మలాథియేన్ మందును ప్రతిరోజూ ఉన్నతాధికారుల సంతకంతో రోజు వారి ఇండెంట్ ద్వారా సంబంధిత వర్కర్లకు జారీ చేస్తారు. మలాథియేన్ మందును హిందుస్తాన్ ఇన్‌సెక్టిసైడ్స్ సంస్థ ద్వారా యేడాదికి రూ.2.25 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుండగా, డీజిల్, పెట్రోల్ కొనుగోలుకు గాను సంవత్సరానికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఫాగింగ్‌ను జులై చివరి వారం లేక ఆగస్టు మొదటి వారంలో మొదలు పెట్టి మార్చి వరకు కొనసాగిస్తారు.
ప్రతి వీధిలో 15 రోజులకు ఒకసారి చొప్పున అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఫాగింగ్ చేసే ప్రాంతంలో కార్మికులు స్థానిక ప్రజలతో సంతకాలు చేయించాల్సి ఉంటుంది. ఫాగింగ్ చేసే కార్యక్రమాలపై ఇద్దరు మలేరియా శానిటేషన్ ఇన్స్‌పెక్టర్లు, సీనియర్ ఎంటమాలజిస్టుతో పాటు ఆరోగ్యాధికారి పర్యవేక్షించాల్సి ఉంది. కానీ కర్నూలు నగరంలో ఫాగింగ్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. 15 రోజులకు ఒకసారి కూడా కాదు రెండు నెలలకు ఒకసారి కూడా ఫాగింగ్ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కాలువల్లోనూ పిచికారీ కరువే...!
దోమల నిర్మూలనకు గాను అబేట్, ఎంఎల్ ఆయిల్ మొదలైన రసాయనాలను జిల్లా మలేరియా విభాగం వారు కర్నూలు నగర పాలక సంస్థకు అందిస్తారు. వీటి ద్వారా ప్రతి రోజూ మురికికాలువల్లో దోమల నిర్మూలనకు పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉన్న చోట మత్స్యశాఖ నుంచి తీసుకొచ్చిన గంబూజియా చేపలను వదలాల్సి ఉంటుంది. చిన్న చిన్న కుంటల్లో దోమలు పెరగకుండా ఆయిల్స్ బాల్స్‌ను వేయాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమాలను నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే చురుకుగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు హడావుడిగా పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం
దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంది. విషజ్వరాలతో ఇప్పటికే పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపైనా, అక్రమాలపైనా జిల్లా కలెక్టర్ విచారణ నిర్వహించి, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.