Performance of officers
-
జీతమెంత.. చేస్తున్న పనెంత?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించి, ప్రక్షాళన చేసే కార్యక్రమానికి ఆ సంస్థ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. సంస్థలో అధికారుల హోదాకు, వారి పనికి మధ్య హేతుబద్ధత లేకుండా పోయిందని ఆర్టీసీ భావిస్తోంది. కొన్ని పోస్టుల్లో అసలు పనే ఉండటం లేదని.. అయినా జీతాలు అధికంగా ఉన్నాయని గుర్తించింది. మరోవైపు డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లపై మాత్రం విపరీతమైన ఒత్తిడి పడుతోందని తేల్చింది. తక్కువ పనిచేసే కొందరు సిబ్బందికి భారీ జీతాలు ఇస్తుండటం మొత్తంగా సంస్థపై వేతనాల భారాన్ని పెంచుతోందని.. ఈ క్రమంలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఓ హెచ్ఆర్ కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించారని.. ఆర్టీసీకి కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న కేరళకు చెందిన మరో వ్యక్తికి పర్యవేక్షణ బాధ్యత ఇచ్చారని తెలిసింది. డిపో స్థాయి నుంచి పరిశీలన ‘‘ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చాలా మంది సిబ్బందికి డిపోల్లో పనిలేకుండా పోయింది. వారికి ఇతర పనులు అప్పగించాలి’’అని ఇటీవల అధికారులతో సమావేశంలో ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు అందింది. ఇలా పని తక్కువగా ఉండి, జీతం ఎక్కువగా తీసుకుంటున్న పోస్టులు చాలా ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు కన్సల్టెన్సీ సంస్థ డిపో స్థాయి నుంచి ఇలాంటి అంశాలను గుర్తించనుంది. డిపో వ్యవస్థ, అక్కడి సిబ్బంది, వారు చేసే పని అన్నింటిని పరిశీలించి.. ఏయే పోస్టులు అనవసరం, తీసుకుంటున్న జీతాల స్థాయిలో పనిలేని వారు ఎందరు, వారిని ఏయే ఇతర పోస్టుల్లో సర్దుబాటు చేయొచ్చు, అసలు అవసరమే లేని పోస్టులెన్ని, అవసరానికి మించి సిబ్బంది ఉన్నారా, డిపోలకు వాస్తవానికి అవసరమైన సిబ్బంది ఎందరు? వంటి వివరాలను నిర్ధారించి నివేదికను సమర్పించనుంది. దీని ఆధారంగా ఆర్టీసీ ఎండీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఎస్పై దృష్టి.. ఇటీవల ఆర్టీసీ ఆదాయం బాగానే మెరుగుపడినా నష్టాలను అధిగమించలేకపోతోంది. మొత్తం వ్యయంలో జీతాల పద్దు దాదాపు 49 శాతం దాకా ఉండటమే దీనికి కారణంగా ఉంటోంది. కొత్త నియామకాలు ఎటూ లేనందున.. ఉద్యోగ విరమణ రూపంలో సిబ్బంది తగ్గితే జీతాల భారం నుంచి ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వీఆర్ఎస్ (స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) పథకాన్ని ప్రారంభించింది. దాదాపు 650 మంది దీని ద్వారా విరమణ పొందారు. తాజాగా సర్వే ద్వారా మరింత మంది సిబ్బంది వీఆర్ఎస్ తీసుకునేలా చూడాలన్న ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్కు చేరువై ఎక్కువ జీతాలు పొందుతున్న సిబ్బంది, చేయటానికి పెద్దగా పనిలేని పోస్టుల్లో ఉన్నవారిని వీఆర్ఎస్ వైపు మళ్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తక్కువ పని ఉండే చోట అవసరమైతే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవటం ద్వారా జీతాల భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. -
సిబ్బంది పనితీరు భేష్ !
గుంటూరు: ప్రస్తుతం రూరల్ జిల్లా పరిధిలోని పోలీసుల పనితీరు మెరుగుపడిందని రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు కొనియాడారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నిర్ధేసించిన లక్ష్యాలను చేరుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చార్జిషీట్లను సకాలంలో వేస్తూ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రూరల్ జిల్లా అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వమించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సాధించిన విజయాలు, చేపట్టాల్సిన చర్యలు, నిర్ధేసించిన లక్ష్యాలు, దర్యాప్తుల్లో తీసుకోవాల్సిన మెలకువలు తదితర అంశాలను వివరించారు. సమావేశానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్.నరసింహారావు, అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జడ్జి నరసింహారావు మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగిస్తే విచారణ సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. సివిల్ వివాదాల్లో ప్రజలు న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి న్యాయం పొందేలా మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. ఐజీ కేవీవీ గోపాలరావు సలహాలతో రూరల్ ఎస్పీ సమయస్ఫూర్తిగా సిబ్బంది విభజనను పూర్తి చేశారని ఎస్పీ సీహెచ్ విజయారావు కొనియాడారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అధికారుల సూచనల మేరకు పనిచేస్తే నిర్ధేసించుకునే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. త్వరలో వింగ్స్ యాప్ జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. స్థలాలు, పొలాలు ఆక్రమణ సమయంలో బాధితులకు సరైన సూచనలు ఇచ్చి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. రెవెన్యూ, పోలీస్‌శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ టీటీకే రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి తేజేవంత్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు. ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ మహిళలపై వేధింపుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సబల కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. నెల రోజుల వ్యవధిలో 300కు పైగా బాధితుల నుంచి ఫిర్యాదు అందాయని చెప్పారు. త్వరలో వింగ్స్ పేరుతో నూతన యాప్‌ను రూపొందించి భద్ర, బ్లూకోట్స్‌ను అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వృద్ధుల కోసం ముదిమ పేరుతో కూడ నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అర్బన్, రూరల్ సిబ్బంది విభజన పూర్తి చేసి అర్హులైన 164 మందికి ఉద్యోగోన్నతులు కల్పించామన్నారు. అనంతరం సబల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో లక్ష్యాలను చేరుకుంటున్నామని తెలిపారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభను చూపిన 84 మందికి శోభిత, శోధన, స్పందన, సబల అవార్డులను అందజేశారు. అతిథులకు మొక్కులు అందజేసి ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఆర్డీవో నాగబాబు, సీనియర్ సిటిజన్స్ అండ్ డిజేబుల్ ఏడీ కే పద్మ సుందరి, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, వివిధ విభాగాల అదికారులు పాల్గొన్నారు. -
దోమ కుట్టినట్లు కూడా లేదు..
నగర పాలక సంస్థ అధికారుల పనితీరు అధ్వానం నగరంలో లోపించిన పారిశుద్ధ్యం కర్నూలు(జిల్లా పరిషత్) : దోమలు.. రక్తం పీలుస్తూ కర్నూలు నగర వాసులకు నిదుర లేకుండా చేయడమే కాక.. భారీగా ఖర్చు పెట్టిస్తున్నాయి. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంతో చిన్న చిన్న కుంటలు, మురుగు కాలువలు వీటికి ఆవాసంగా మారాయి. వీటి బారిన పడి ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దోమల బారి నుంచి తప్పించుకోవడానికి 99 శాతం మంది ప్రజలు మస్కిటో కాయిల్స్, మస్కిటో లిక్విడ్స్, ఇతర స్ప్రేలను పెద్ద మొత్తంలో వాడుతున్నారు. ఫలితంగా కర్నూలు నగరంలోని ప్రజలు దోమల నుంచి రక్షించుకోవడానికి, దోమల బారిన పడి జ్వరాలు నయం చేసుకునేందుకు వైద్యం కోసం ప్రతి నెలా రూ. కోటికి పైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దోమల బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. నగర పాలక సిబ్బంది నిర్లక్ష్యం.. కర్నూలు నగర పాలక సంస్థ సిబ్బంది పనితీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నా వీరికి ‘దోమ’ కుట్టినట్లు కూడా లేదు. కర్నూలు నగరంలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 80 వేలకు పైగా గృహాల్లో 5 లక్షల పై చిలుకు జనాభా నివాసం ఉంటోంది. కార్పొరేషన్‌లోని ఆరోగ్య విభాగం పరిధిలో 13 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. మొత్తం 11 మంది శానిటరి ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు గాను 470 మంది కార్మికులు ప్రతిరోజూ పనిచేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దోమల నివారణకు, నిర్మూలనకు గాను నగర పాలక సంస్థలోని మలేరియా విభాగంలో 20 మంది రెగ్యులర్ మజ్దూర్లు, మరో 25 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే మజ్దూర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు సిబ్బందికి ప్రతి యేటా రూ. 23 లక్షల వేతనాన్ని ఇస్తున్నారు. వీరిపై ఇద్దరు మలేరియా శానిటరి ఇన్స్పెక్టర్లు, ఒక సీనియర్ ఎంటమాలజిస్టు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత మంది పని చేస్తున్నా పారిశుద్ధ్యం మెరుగు పడటం లేదు. ఫార్స్‌గా ఫాగింగ్ కార్యక్రమం దోమల నివారణలో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డుల్లో ఫాగింగ్ చేసేందుకు డీజిల్, పెట్రోల్, మలాథియేన్ మందును ప్రతిరోజూ ఉన్నతాధికారుల సంతకంతో రోజు వారి ఇండెంట్ ద్వారా సంబంధిత వర్కర్లకు జారీ చేస్తారు. మలాథియేన్ మందును హిందుస్తాన్ ఇన్సెక్టిసైడ్స్ సంస్థ ద్వారా యేడాదికి రూ.2.25 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుండగా, డీజిల్, పెట్రోల్ కొనుగోలుకు గాను సంవత్సరానికి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఫాగింగ్ను జులై చివరి వారం లేక ఆగస్టు మొదటి వారంలో మొదలు పెట్టి మార్చి వరకు కొనసాగిస్తారు. ప్రతి వీధిలో 15 రోజులకు ఒకసారి చొప్పున అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఫాగింగ్ చేసే ప్రాంతంలో కార్మికులు స్థానిక ప్రజలతో సంతకాలు చేయించాల్సి ఉంటుంది. ఫాగింగ్ చేసే కార్యక్రమాలపై ఇద్దరు మలేరియా శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ ఎంటమాలజిస్టుతో పాటు ఆరోగ్యాధికారి పర్యవేక్షించాల్సి ఉంది. కానీ కర్నూలు నగరంలో ఫాగింగ్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. 15 రోజులకు ఒకసారి కూడా కాదు రెండు నెలలకు ఒకసారి కూడా ఫాగింగ్ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాలువల్లోనూ పిచికారీ కరువే...! దోమల నిర్మూలనకు గాను అబేట్, ఎంఎల్ ఆయిల్ మొదలైన రసాయనాలను జిల్లా మలేరియా విభాగం వారు కర్నూలు నగర పాలక సంస్థకు అందిస్తారు. వీటి ద్వారా ప్రతి రోజూ మురికికాలువల్లో దోమల నిర్మూలనకు పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉన్న చోట మత్స్యశాఖ నుంచి తీసుకొచ్చిన గంబూజియా చేపలను వదలాల్సి ఉంటుంది. చిన్న చిన్న కుంటల్లో దోమలు పెరగకుండా ఆయిల్స్ బాల్స్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలను నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే చురుకుగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు హడావుడిగా పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంది. విషజ్వరాలతో ఇప్పటికే పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపైనా, అక్రమాలపైనా జిల్లా కలెక్టర్ విచారణ నిర్వహించి, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.