సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించి, ప్రక్షాళన చేసే కార్యక్రమానికి ఆ సంస్థ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. సంస్థలో అధికారుల హోదాకు, వారి పనికి మధ్య హేతుబద్ధత లేకుండా పోయిందని ఆర్టీసీ భావిస్తోంది. కొన్ని పోస్టుల్లో అసలు పనే ఉండటం లేదని.. అయినా జీతాలు అధికంగా ఉన్నాయని గుర్తించింది. మరోవైపు డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లపై మాత్రం విపరీతమైన ఒత్తిడి పడుతోందని తేల్చింది.
తక్కువ పనిచేసే కొందరు సిబ్బందికి భారీ జీతాలు ఇస్తుండటం మొత్తంగా సంస్థపై వేతనాల భారాన్ని పెంచుతోందని.. ఈ క్రమంలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఓ హెచ్‌ఆర్ కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించారని.. ఆర్టీసీకి కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న కేరళకు చెందిన మరో వ్యక్తికి పర్యవేక్షణ బాధ్యత ఇచ్చారని తెలిసింది.
డిపో స్థాయి నుంచి పరిశీలన
‘‘ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చాలా మంది సిబ్బందికి డిపోల్లో పనిలేకుండా పోయింది. వారికి ఇతర పనులు అప్పగించాలి’’అని ఇటీవల అధికారులతో సమావేశంలో ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు అందింది. ఇలా పని తక్కువగా ఉండి, జీతం ఎక్కువగా తీసుకుంటున్న పోస్టులు చాలా ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు కన్సల్టెన్సీ సంస్థ డిపో స్థాయి నుంచి ఇలాంటి అంశాలను గుర్తించనుంది.
డిపో వ్యవస్థ, అక్కడి సిబ్బంది, వారు చేసే పని అన్నింటిని పరిశీలించి.. ఏయే పోస్టులు అనవసరం, తీసుకుంటున్న జీతాల స్థాయిలో పనిలేని వారు ఎందరు, వారిని ఏయే ఇతర పోస్టుల్లో సర్దుబాటు చేయొచ్చు, అసలు అవసరమే లేని పోస్టులెన్ని, అవసరానికి మించి సిబ్బంది ఉన్నారా, డిపోలకు వాస్తవానికి అవసరమైన సిబ్బంది ఎందరు? వంటి వివరాలను నిర్ధారించి నివేదికను సమర్పించనుంది. దీని ఆధారంగా ఆర్టీసీ ఎండీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వీఆర్‌ఎస్‌పై దృష్టి..
ఇటీవల ఆర్టీసీ ఆదాయం బాగానే మెరుగుపడినా నష్టాలను అధిగమించలేకపోతోంది. మొత్తం వ్యయంలో జీతాల పద్దు దాదాపు 49 శాతం దాకా ఉండటమే దీనికి కారణంగా ఉంటోంది. కొత్త నియామకాలు ఎటూ లేనందున.. ఉద్యోగ విరమణ రూపంలో సిబ్బంది తగ్గితే జీతాల భారం నుంచి ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) పథకాన్ని ప్రారంభించింది. దాదాపు 650 మంది దీని ద్వారా విరమణ పొందారు.
తాజాగా సర్వే ద్వారా మరింత మంది సిబ్బంది వీఆర్‌ఎస్ తీసుకునేలా చూడాలన్న ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్‌కు చేరువై ఎక్కువ జీతాలు పొందుతున్న సిబ్బంది, చేయటానికి పెద్దగా పనిలేని పోస్టుల్లో ఉన్నవారిని వీఆర్‌ఎస్ వైపు మళ్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తక్కువ పని ఉండే చోట అవసరమైతే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవటం ద్వారా జీతాల భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment