నెత్తురు పీల్చేస్తా..!
నెత్తురు పీల్చేస్తా..!
Published Mon, Jan 13 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్: ‘దీని దుంపతెగ కుట్టికుట్టి సంపేత్తంది. రక్తం పీల్చేత్తంది. రాత్రంతా నిద్ర పట్టి చావదు’. విజయనగరం, పార్వతీపురం పట్టణాల ప్రజల అవస్థలు ఇవి. దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ఆయా పట్టణాల ప్రజలు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను నష్టపోతున్నారు. పట్టణాల్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు సరిపడినన్ని వాహనాలు లేకపోవడం.. సిబ్బంది కొరత..వెరసి ఆ పట్టణాలు దోమల సంతాన వృద్ధి కేంద్రాలుగా మారిపోయాయి. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఏడాదీ పట్టణాల్లో మలాథియన్ పిచికారీ చేసేవారు. అలాగే ఫాగింగ్ యంత్రం ద్వారా దోమలను నియంత్రించే చర్యలు చేపట్టేవారు. గత ఎనిమిది నెలలుగా ఫాగింగ్, మలాథియన్ పిచికారీ చేయకపోవడంతో దోమలు బాగా పెరిగిపోయాయి.
విజయనగరం పట్టణంలో సుమారు 50వేల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఇంట్లో ప్రతిరోజూ రాత్రి కనీసం ఒక మస్కిటో కాయిల్ ఉపయోగిస్తారు. ఈ కాయిల్ ధర రూ.2 ఉంటుంది. దోమలు కుట్టకుండా ఉండేందుకు ప్రజలు రోజుకు రూ.2 చొప్పున ఖర్చుచేస్తే నెలకు రూ.60 అవుతుంది. యాభై వేల కుటుంబాలకు నెలకు రూ.30లక్షలు ఖర్చు కాగా, సంవత్సరానికి సుమారు రూ.3,60,00,00 ఖర్చవుతుం ది. పట్టణ ప్రజలకు తెలియకుండానే అక్షలారా రూ.3 కో ట్లకు పైగా ఖర్చవుతోంది.పార్వతీపురం మున్సిపాల్టీలో సుమారు 11,400 ఇళ్లు ఉన్నాయి. పట్టణంలో ప్రజలకు రోజుకు రూ.2చొప్పున సంవత్సరానికి కాయిల్‌కు రూ.82,08,000 ఖర్చవుతోంది. బొబ్బిలి, సాలూరులలో ఫాగింగ్, మలాథియన్ కాలువలో జల్లుతున్నారు.
ఫాగింగ్ యంత్రంతో నిర్మూలించరా..
విజయనగరం పట్టణంలో సుమారు రెండున్నర లక్షల మంది జనాభా, విలీన గ్రామాలను కలుపుకొని 40 వార్డులుగా విభజించారు. పట్టణంలో ఒక ఫాగింగ్ యంత్రం ఉంది. ఆ యం త్రం ద్వారా ఒక రోజులో రెండుమూడు వార్డులను మాత్రమే కవర్ చేస్తారు. ఫాగింగ్ యంత్రానికి రోజుకు రూ. పదివేల వరకు ఖర్చుఅవుతుంది. రోజుకు రూ.పదివేలు ఖర్చయిపోతోందని, ప్రజలెలా పోతే మనకేమిలే అని మున్సిపల్ అధికారులు ఫాగింగ్ చేయడం మానేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పురాతన కాలంనాటి కాలువలు..
విజయనగరం పట్టణంలోని కాలువలు పురాతన కాలంనాటివి కావడంతో ఎప్పుడూ చెత్తచెదారాలతోనే నిండి ఉంటున్నాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలను నిర్మూలించడానికి మలాథియన్‌ను కాలువల్లో జల్లాలి. దీన్ని కూడా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో ఉన్న చెత్తను తీయడానికి తగినంత సిబ్బంది లేకపోవడం కూడా దోమలు వృద్ధి చెందడానికి కారణంగా చెప్పవచ్చు.
పెద్దచెరువు..
పెద్దచెరువులోకి పట్టణంలోని మురుగునీరంతా చేరుతుంది. మురుగు నీరు చేరడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. 2011లో అప్పటి కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పెద్దచెరువులో మలాథియన్ జల్లించి దోమలు వృద్ధి చెందకుండా చూశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఆ పనిచేయడం మరిచిపోయారు. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం..
పట్టణంలో దోమలను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్ చేయడం వల్ల ప్రజలకు కేన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని కాలుష్య నియంత్రణ మం డలి అధికారులు చెప్పారు. దీంతో ఫాగింగ్ చేయడం నిలిపివేశాం.
- ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ కమిషనర్, విజయనగరం
Advertisement
Advertisement