కన్న కొడుకు కోసం తల్లి యాతన
వైద్యానికి చిల్లిగవ్వలేక అల్లాడుతున్న తండ్రి
ప్రాణం పోయమని వేడుకోలు
ప్రసవం నాడు ఆ తల్లి ఎంత వేదన అనుభవించిందో గానీ ఇప్పుడు ఆ బిడ్డను కాపాడుకునేందుకు అంతకంటే ఎక్కువ వేదనే పడుతోంది. కొడుకుకు జబ్బు చేసిందని తెలిసి ఆ తల్లి గుండె తల్లిడిల్లిపోతోంది. తన చేయి పట్టుకుని నడచిన బిడ్డ చేయందిస్తే గానీ లేవలేని స్థితిలో ఉండడంతో ఆ తండ్రి కళ్లు కన్నీటిధారలవుతున్నాయి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుమారుడిని బతికించుకోవడానికి ఆ దంపతులు చేయని ప్రయత్నం లేదు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారు దాతల సాయం అర్థిస్తున్నారు. ఇప్పటికే గుండె జబ్బుతో కుమార్తెను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
కల్లేపల్లి(లక్కవరపుకోట) : మండలంలోని కళ్లేపల్లి గ్రామానికి చెందిన అయ్యలసోమయాజుల శ్రీనివాసప్రసాద్, లక్ష్మీఅపర్ణ దంపతుల కుమారుడు మణికంఠ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ బాలుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తొలుత ఆరోగ్యంగానే ఉండేవాడు. అయితే తర్వాత అనారోగ్యం చేయడంతో వైద్య పరీక్షలు చేయగా గుండె జబ్బు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయినా ఆ తల్లిదండ్రులు స్థాయికి మించి వైద్యం చేయిం చారు. కానీ తర్వాత వారి గుండెపై మరో పిడుగు పడింది. బిడ్డకు కిడ్నీల వ్యాధి ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో వారు తల్లిడిల్లిపోతున్నారు. విశాఖలోని సెవెన్ హిల్స్‌లో వైద్యం చేయించగా కిడ్నీసమస్యఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
వైద్యం కోసం అవస్థలు...
కిడ్నీలు పాడైపోవడంతో మణికంఠకు ప్రస్తుతం డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఓ సారి ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు. డయాలసిస్‌కు వెళ్లిన ప్రతిసారి రూ10 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. తరచూ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుండడంతో వీరు వేపగుంటలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. మణికంఠ ఆరోగ్యం కుదుట పడాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్‌కు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వీరు ఏం చేయాలో తెలీక బాధపడుతున్నారు.
పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే వీరి కుమార్తె నాగ సుప్రజ 2010లో గుండె జబ్బుతో మృతి చెందింది. తాను చిన్న ఉద్యోగం చేస్తున్నానని, ఆ జీతం తమ పొట్టపోషణకే సరిపోవడం లేదని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. దాతలు సాయం చేసి తమకు పుత్రబిక్ష పెట్టాలని ఆయన కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు ఫోన్ నంబర్ 8008286124, 9989768484ను సంప్రదించాలని తెలిపారు.
ఊపిరి పోయరూ...!
Published Thu, Feb 19 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement