![70-Year-Old Grandma Donates Kidney To Young Grandson In MP Jabalpur](/styles/webp/s3/article_images/2024/06/11/Kidney_70years%20woman_MP.jpg.webp?itok=hYDUGeWp)
ఆధునిక కాలంలో అవయవదానం సాధారణంగా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది తన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని భయపడిపోతారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఒక కిడ్నీని, లివర్‌లోని కొంత భాగాన్ని దానమిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ 70 ఏళ్ల బామ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన మనవడిని ఎలాగైనా రక్షించుకోవాలని తాపత్రయపడింది. ధైర్యంగా కిడ్నీని దానం చేసి నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జబల్‌పూర్‌లోని సిహోరాకు చెందిన యువకుడు (23) గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అతనికి కిడ్నీ మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తెలిపారు. కిడ్నీ దాతలకోసం కుటుంబ సభ్యులు అన్వేషణ మొదలు పెట్టారు. కుటుంబ మిగిలిన సభ్యులతో పోలిస్తే బామ్మ, మనవడి బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. వారిద్దరికీ సంబంధిత పరీక్షలు చేయగా, బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అటు బామ్మ కూడాతన కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరించింది. నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మమ్మ ధైర్యంతో ముందుకువచ్చ తన మనవడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం విశేషంగా నిలిచింది.
కిడ్నీమార్పిడిఆపరేషన్ విజయవంతమైందనీ, ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, జబల్‌పూర్ మెట్రో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విశాల్ బదేరా, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ రాజేష్ పటేల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment