
పూడి వరలక్ష్మి(ఫైల్), బల్లే సరిత (ఫైల్)
ఈ సృష్టిలో తల్లిప్రేమకు సాటి ఏదీ లేదనేది జగమెరిగిన సత్యం. పుట్టినప్పటి నుంచికంటికి రెప్పలా కాపాడుకుంటూ తమ జీవితాలను పిల్లల కోసం అర్పించిన మాతృమూర్తులెందరో.. అలాంటి ఓ తల్లి కూతురి మరణాన్ని తట్టుకోలేక తానూ తనువు చాలించింది. వారి పేగు బంధాన్ని విడదీయ లేక మృత్యువు కూడా కన్న ప్రేమ ముందు ఓడిపోయింది..
పశ్చిమగోదావరి, దేవరపల్లి: ఈ విషాద సంఘటన దేవరపల్లిలో జరిగింది. ఒకే ఇంట్లో గంట వ్యవధిలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులో టుబాకో బోర్డు కార్యాలయం సమీపంలోని పూడి చలమయ్య ఇంట్లో శుక్రవారం విషాద సంఘటన జరిగింది. చలమయ్య కుమార్తె బల్లే సరిత(21) ఇటీవల దేవరపల్లిలోని పుట్టింటికి వచ్చింది. గురువారం పుట్టింట్లో జరిగిన గృహ ప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడిపింది. రాత్రి భోజనం అనంతరం పిచ్చాపాటి మాట్లాడుతూ అంతా నిద్రించారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో సరిత బాత్‌రూమ్‌కి వెళ్లి కాలుజారి పడిపోయింది.
ఎంతసేపటికీ సరిత బాత్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్‌రూమ్ వద్దకు వెళ్లి చూడగా సరిత పడిపోయి ఉంది. వెంటనే బయటకు తీసుకురాగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ సంఘటన చూసిన తల్లి వరలక్ష్మి బోరున విలపిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. అనంతరం కొద్ది నిమిషాల్లోనే వరలక్ష్మి గుండె ఆగిపోయింది. కుమార్తె మరణించిన కొద్ది సేపటికే తల్లి వరలక్ష్మి మృతి చెందడంతో ఆఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సరితను మూడు సంవత్సరాల క్రితం మండలంలోని యాదవోలుకు చెందిన బల్లే గణేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను స్థానిక çశ్మశాన వాటికలో పక్కపక్కనే ఉంచి అంత్యక్రియలు చేశారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment