దర్శి: ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు.. ఐదు నెలల క్రితం అన్న మృతి చెందాడు.. సోమవారం రాత్రి తల్లి కూడా అందని తీరాలకు వెళ్లిపోయింది. అయినా ఆ కూతురు గుండె నిబ్బరంతో తల్లికి తలకొరివి పెట్టి కన్నతల్లి రుణం తీర్చుకుంది. దర్శికి చెందిన భార్గవికి మూడు సంవత్సరాల క్రితం వివాహామైంది. కాగా ఐదు సంవత్సరాల క్రితం తండ్రి పాపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. విధి వెక్కిరించడంతో ఐదు నెలల క్రితం అన్న లోకేష్‌రెడ్డి విద్యుత్ షాక్‌తో విజయవాడలో మృతి చెందాడు. ఈ క్రమంలో పుచ్చమిట్టలో నివాసముంటున్న రమణమ్మ (53) అనారోగ్య కారణంతో ఒంగోలు ఆసుపత్రిలో మృతి చెందింది.
తల్లి మరణ వార్త తెలుసుకుని కుమార్తె విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో తల్లి రమణమ్మ మృత దేహానికి తలకొరివి పెట్టే వారు లేకుండా పోయారు. దీంతో తానే తలకొరివి పెడతానంటూ ముందుకు వచ్చింది. భర్త సమ్మతం కూడా లభించడంతో మంగళవారం కర్మకాండలు ముగించింది. బంధువులంతా ఈ సంఘటన చూసి మరింత కన్నీరుమున్నీరయ్యారు. కూతురు అంటే ఇలా ఉండాలని దీవించారు. అయితే దహన సంస్కారాలు చేసే సమయంలో కొంతమంది అడ్డువచ్చారు. ఆడ పిల్లలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. కానీ భార్గవి ప్రేమ ముందు వారంతా తలదించక తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment